నేటి వామపక్ష విద్యార్థి సంఘాల బడుల బంద్‌కు డీవైఎఫ్‌ఐ మద్దతు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వామపక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తలపెట్టిన ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫుడ్‌ ఫాయిజన్‌ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే సమీక్షా సమా వేశాన్ని ఏర్పాటు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, హాస్టళ్లలో వరుస ఘటనలు జరుగుతున్నా అధికారు లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనానికి ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడం లేదని పేర్కొన్నారు. నిధులు పెంచాలని కోరారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలో ప్రధానంగా జీసీసీ ద్వారా నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. జీసీసీపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సరుకుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తున్న జీసీసీ మేనేజర్లపై చర్యలు తీసుకో వాలని కోరారు. పెంచిన మెస్‌, కాస్మోటిక్‌ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలిపారు.