ఎస్‌ఏఎస్‌సీఐ కింద రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి

Development of Ramappa and Somashila tourist circuits under SASCI– రూ.142 కోట్ల విడుదలకు కేంద్రం ఆమోదం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారత పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ టూ స్టేట్స్‌/యూనియన్‌ టెరిటరీస్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(ఎస్‌ఏఎస్‌సీఐ) పథకం కింద రూ.142 కోట్లతో రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రెండు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోడీ, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా 23 రాష్ట్రాల్లోని 40 ప్రాజెక్టులకు ఆమో దం లభించిందనీ, రూ.3,295.76 కోట్ల విలువైన ఆ ప్రాజెక్టులకు 50 సంవత్సరాల కాలవ్యవధితో వడ్డీరహిత రుణాలు అందిస్తామని తెలిపారు. సుస్థిరమైన పర్యాటకంతో ఉపాధి సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా సుస్థిర పర్యాటక సర్క్యూట్‌ కింద రామప్ప ప్రాంతాన్ని రూ.74 కోట్లతో అభివృద్ధి చేయను న్నట్టు తెలిపారు. వెల్‌నెస్‌, స్పిర్చ్యివల్‌ రిట్రీట్‌ నల్లమల కింద రూ.68 కోట్లతో సోమశిల ప్రాంతా న్ని అభివృద్ధి చేయన్నుట్టు ప్రకటించారు. సందర్శ కులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిసా ్తమని తెలిపారు. ఇప్పటికే స్వదేశ్‌ దర్శన్‌ కింద చేపట్టిన పర్యాటక అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రసాద్‌ పథకం కింద రూ.42 కోట్లతో భద్రాచలం రామాలయం, రూ.37 కోట్లతో ఆలంపూర్‌ జోగులాంబ ఆలయం, రూ.4.5 కోట్లతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల అభివృద్ధి నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. స్వదేశ్‌ దర్శన్‌ 2.0 పథకం కింద రూ.57 కోట్లతో భువనగిరి కోటను, రూ.38 కోట్లతో అనంతగిరి ఎకో టూరిజం ప్రాజెక్టులను, ఛాలెంజ్‌ బేస్డ్‌ డెస్టినేషన్‌ డెవలప్మెంట్‌ పథకం కింద రూ.25 కోట్లతో నల్లగొండ కల్చర్‌, హెరిటేజ్‌ ప్రాజెక్టు, రూ.10 కోట్లతో కామారెడ్డి (కల్కి చెరువు) ఎకో టూరిజం ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరు చేశామని ప్రకటించారు. తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.