సందర్భానుసారంగా, సమయాను కూలంగా మాట్లాడటం ఒక కళ. అందులోనూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా తడుముకోకుండా, గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం, సెటైర్లు వేయటం ద్వారా ఎదుటి వారిని ఆకట్టుకోవటం అరుదైన కళ. అది కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో సీనియర్ పొలిటీషియన్ రావుల చంద్రశేఖరరెడ్డి ముందు వరసలో ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జమానాలో అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చీఫ్ విప్‌గా పని చేశారాయన. ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఓసారి శాసనసభలో రావుల… తన ప్యాంటును రెండు చేతులతో కొంచెం పైకి పట్టుకుని ప్రసంగించటం మొదలుపెట్టారు. అలా ఎందుకు పట్టుకున్నారంటూ స్పీకర్ అడగ్గా… ‘అధ్యక్ష్యా, ముఖ్యమంత్రి (వైఎస్) గారు చెప్పింది అక్షరాలా నిజం. జలయజ్ఞం ద్వారా కాలువల్లో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ నీళ్లు మన అసెంబ్లీని కూడా తాకాయి అధ్యక్షా, అందుకే తడిసిపోకుండా నా ప్యాంటును అలా పైకి పట్టుకున్నా…’ అని వ్యాఖ్యానించటంతో సభికులు ఘొల్లుమన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్న రావులకు ఇదే విషయాన్ని ఇటీవల పాత్రికేయులు గుర్తు చేయగా… ఆయన తనదైన శైలిలో మరోసారి ఆనాటి సీన్‌ను రీక్రియేట్ చేసి రక్తి కట్టించారు. అలాగే సచివాలయంలోకి వెళ్లేందుకు విజిటర్ పాస్‌లు, ఇతరత్రా వివరాలు చూపించాల్సి వస్తోందంటూ జర్నలిస్టులు ప్రస్తావించగా… అవును నిజమే.. నేను కూడా గతంలో ఓసారి సచివాలయానికి వెళ్లా, అప్పుడు నన్ను కూడా పాస్ చూపించమని అడిగారు, దానికి నేను…’ఈ ఫేసు నలభై ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉంది, అలాంటిది ఇప్పుడు కూడా నన్ను పాస్ అడిగితే ఎలా…?’ అంటూ ప్రశ్నిం చానని చెప్పేసరికి విలేకర్లు మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. గమ్మత్తేమిటంటే… ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి, జలయజ్ఞాన్ని నిర్వహించిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, అదే జలయజ్ఞంపై అసెంబ్లీలో విమర్శలు గుప్పించిన ఆనాటి టీడీపీ నేత రావుల… ఇద్దరూ ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతుండటం కొసమెరుపు.
-బి.వి.యన్.పద్మరాజు