చాదస్తపు మొగడు చెబితే వినడు, చెప్పకపోతే కరుస్తడు

చాదస్తపు మొగడు చెబితే వినడు, చెప్పకపోతే కరుస్తడుమొగడు అంటే భర్త. ఈ పోస్ట్‌ కు అహంకారం ఇన్బిల్ట్‌ గానే ఉంటుంది. సమాజంలో కుటుంబంలో ఆధిపత్యం చెలాయించడం చూస్తూ పెరిగిన మనిషి కాబట్టి అది సాధారణంగా పోదు. అందులో చాదస్తం ఎక్కువైతే ఆ ఇల్లాలి పని ఇక ఇంతే సంగతులు. పోనీ సలహా ఇద్దామన్నా ఇలాంటివారు వినరు. అందుకే ‘చాదస్తపు మొగడు చెబితే వినడు, చెప్పకపోతే కరుస్తడు’ అంటారు. ఇలాంటి వాళ్లే కొట్లాటకు దిగితే ‘కింద పడ్డ నేనే గెలిచిన, మీద పడ్డా నేనే గెలిచిన’ అని వాదిస్తారు. అన్నీ నేనే ఏదైనా నాదే అనే తత్వం పేరుకుపోయి ఉంటుంది. ఇటువంటి వాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే ‘చచ్చిపోయిన బర్రె పలిగి పోయిన బుడ్డేడు పాలు ఇచ్చిందట’ అన్నట్టు. బుడ్డేడు ఒక స్టీలు బిందె సమానం. అన్ని పాలు ఇవ్వదు కానీ ఆయన గారి ఏతులు మాటలు అట్లా ఉంటాయి. కొందరు బాగా ఏదైనా తినడానికే ఇష్టపడుతరు. వీళ్లను పుల్లె గండు వాల్లు లేదా భూకరోళ్లు అని అంటారు. ఈ తినే పద్ధతి స్త్రీలకు ఉంటే తన పిల్లలకి ఏం పెడతది అనే ఉద్దేశంలో ‘పుల్లెగండు ఆమెకు పిల్లలు దక్కరట’ అనే సామెత వాడుతారు. తిన్నంక కూడా కొందరు తిననట్టే మొఖం పెడతారు. ‘మొంటెడు చాపలు తిన్న పిల్లి లెక్క మొఖం పెడతది’ అంటారు. ఏదైనా తిన్నాక తినక ముందు కూడా పిల్లి ముఖ కవలికలు మారకుండా ఉంటాయట….
– అన్నవరం దేవేందర్‌, 9440763479