– పాలమూరు సభ చారిత్రాత్మకం : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో ఏక కాకంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. గత సర్కార్ దొడ్డు బియ్యం పేరుతో దళారీలు, మిల్లర్లకు లబ్ధిచేకూర్చితే, తమ ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చి రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల ఊబిల్లో కూరుకుపోయిందనీ, ప్రతి నెలా రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను గాడీలో పెడుతూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నా మని గుర్తు చేశారు. వలసలకు నిలయమైన పాలమూరు ను ప్రగతి పథంలో నడిపించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నిబద్దతతో పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు పాలమూరుకు వెచ్చిస్తామని సీఎం ప్రకటించడం పట్ల మంత్రి జూపల్లి హర్షం వ్యక్తం చేశారు. రైతు పండగ సక్సెస్ కావడంతో బీఆర్‌ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.లక్ష కోట్లు వెచ్చించిన గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న జూరాల, భీమా ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని విమర్శిం చారు.కుర్చీ వేసుకుని ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తానన్న కేసీఆర్ పాలమూరుకు చుక్క నీరివ్వ లేదని ఆరోపించారు.కాంగ్రెస్ మెదలు పెట్టిన జిల్లా సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం పదేండ్లలో పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు.తిమ్మిన బమ్మిని చేద్దామనే బీఆర్‌ఎస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.