పట్టుబడిన గంజాయి, డ్రగ్స్‌ ముఠా

Cannabis drug gang busted– వేర్వేరు ఘటనల్లో ఆరుగురు అరెస్టు, ఒకరు పరారీ
– వివరాలు వెల్లడించిన మాదాపూర్‌ డీసీపీ వినీత్‌
నవతెలంగాణ-మియాపూర్‌
గంజాయి తరలిస్తున్న ముఠాలోని ఇద్దరితో పాటు ఓ హౌటల్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్న మరో నలుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్‌ మీడియాకు వెల్లడించారు. ఒడిశాలోని మాల్కన్‌గిరి జిల్లాకు చెందిన బిక్రం హిరాతోపాటు మరికొందరు ఓ ముఠాగా ఏర్పడి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నారు. వీరు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసుకుని గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడలో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ పోలీసు చెక్‌ పాయింట్స్‌ ఉన్నాయా? లేవా? ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని గుర్తించి గంజాయి తరలించే బ్యాచ్‌కు సమాచారం ఇస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనంతరం కారులో గంజాయిని తరలిస్తారు. కాగా, గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చందానగర్‌, బాలానగర్‌ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. నెంబర్‌ ప్లేట్‌ లేకుండా వెళ్తున్న కారును గుర్తించిన పోలీసులు దాన్ని అడ్డుకొని కారును తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 13 డ్రై గంజాయి ప్యాకెట్లు విడిగా విడగొట్టి తరలిస్తున్నట్టు గుర్తించారు.
ఓయో రూమ్‌లో డ్రగ్స్‌ పార్టీ చేస్తున్న వ్యక్తుల అరెస్ట్‌
ఓయో రూమ్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ వివరించారు. కొండాపూర్‌లోని ఒక హౌటల్‌లో మాదకద్రవ్యాలతో కొంతమంది వ్యక్తులు పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దాంతో పోలీసులు హౌటల్‌పై రైడ్‌ నిర్వహించారు. వివిధ రంగాలను చెందిన గంగాధర్‌, కాన మహంతి, ప్రియాంకరెడ్డి, ఒరిగాల షాకీని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.4లక్షల 80వేల విలువ చేసే ఎంఎన్‌డీఎంఎస్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్‌ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్టు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుందని డీసీపీ తెలిపారు.