భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలి..

Farmers who are losing land should be given land instead.– ఎకరానికి రూ.2 ,3 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి..
– భూ నిర్వాసితుల సంఘం, తెలంగాణ రైతు సంఘం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రంగారెడ్డి జిల్లా గౌరెల్లి నుండి భద్రాచలం కొత్తగూడెం వరకు చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ భూమికి బదులు భూమి లేదా ఎకరానికి రెండు కోట్ల నుండి మూడు కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు మాటూరి బాలరాజు, కొండమడుగు నర్సింహ్మ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భూ నిర్వాసితుల సంఘం, తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భూములు కోల్పోతున్న భూదాన్ పోచంపల్లి మండల, పట్టణ మరియు వలిగొండ మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రాజెక్టుల పేరుతో, రోడ్ల పేరుతో, పరిశ్రమల పేరుతో వేలాదెకరాల భూములను రైతుల నుండి పంట పండే పచ్చటి పొలాలను తీసుకోవడం చాలా దారుణమని అన్నారు. భూదాన్ పోచంపల్లి, వలిగొండ మండలాల్లో సుమారు 20 గ్రామాల్లోని 500 పైగా ఎకరాల భూమి గౌరెల్లి- భద్రాచలం జాతీయ రహదారికి రైతుల నుండి తీసుకుంటున్నప్పుడు వారికి సరైన నష్టపరిహారము చెల్లించే కాడ ప్రభుత్వ వైఖరి చాలా దారుణంగా ఉందని అన్నారు. అనాది నుండి భూమిని నమ్ముకుని జీవిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న రైతుల నుండి భూమిని లాగుకుంటే ఆ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వము రోడ్డు కోసం తీసుకుంటున్న భూములు ఎకరానికి 2 నుండి 3 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్లో ధర ఉంటే కేవలం ఎకరానికి 7.5 లక్షలు చెల్లిస్తామని చెప్పడం ఎట్లా కరెక్ట్ అని అన్నారు.
ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారము కనీసం ఒక గుంట భూమి కూడా కొనే పరిస్థితిలో లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము, అధికారులు వాస్తవ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రాంతంలో ఆ భూములకున్న ధరలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే భూదాన్ పోచంపల్లి, వలిగొండ మండలాలను గ్రీన్ బెల్ట్ గా ప్రకటించిందని మరి అలాంటి భూములకు సరైన నష్టపరిహారం చెల్లించకపోతే ఆ ప్రాంత భూములు కోల్పోతున్న రైతులు ఏమి కావాలని అన్నారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తగిన బాధ్యత తీసుకొని భూములు కోల్పోతున్న రైతులందరికీ ఎకరానికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆయా ప్రాంతాల్లో రోడ్డును వేయకుండా అడ్డుకుంటామని బాలరాజు, నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ధర్నా కార్యక్రమం దగ్గరికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి, జిల్లా కలెక్టర్ కి భూములు కోల్పోతున్న రైతులతో కలిసి చర్చించిన అనంతరం మెమోరండాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు మంచాల మధు, భూ నిర్వాసితులు పిల్లాయిపల్లి మాజీ సర్పంచ్ అందెల హరీష్, గూడూరు బుచ్చిరెడ్డి, మల్గ రవీందర్, భీమిరెడ్డి నరేందర్ రెడ్డి, మామిళ్ల యాదయ్య, డేగల కిష్టయ్య గాధగోని మల్లేష్, వారాల శేఖర్ రెడ్డి, ఉడతల రాందాస్, గంగమోని మధు, కోట రంగారెడ్డి, భూపాల్ రెడ్డి, లింగస్వామి, లక్ష్మారెడ్డి, వెంకటేశం, జంగారెడ్డి, గోవర్ధన్, రాములు, పద్మ, లక్ష్మమ్మ, విజయ రెడ్డి, ప్రసన్న లక్ష్మి, కిష్టయ్య, సాయిలు, నరసింహ, పర్వతాలు, మహిపాల్ రెడ్డి, మహేందర్, రాజశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు.
భూ నిర్వాసితుల కమిటీ ఎన్నిక..
అనంతరం భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ గా గూడూరు బుచ్చిరెడ్డిని, కో- కన్వీనర్ గా మల్గ రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.