– పోలీసులకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన ఘటనపై హైకోర్టు సోమవారం విచారణచేపట్టింది. వాళ్ల మృతదేహాలను మంగళవారం వరకు భద్రపరచాలని ఏటూరునాగారం ఎస్‌హెచ్‌ఓను ఆదేశించింది. మృతదేహాలను చూడటానికి పిటిషనర్‌తోపాటు బంధువులను అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాలన్న పిటిషనర్ వినతిని తోసిపుచ్చింది. ఏటూరునాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమంటూ మృతుడు మల్లయ్య భార్య కె ఐలమ్మ అలియాస్ మీనా వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ విజరుసేన్‌రెడ్డి విచారించారు. ప్రాణాలతో తీసుకెళ్లి కాల్చేశారనీ, విషాహారం పెట్టి మత్తులోకి జారుకున్నాక తీసుకువెళ్లి నానా చిత్రహింసలు పెట్టారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఆ తర్వాతే వాళ్ల శరీరంలోకి పోలీసుల బుల్లెట్‌లు దిగాయన్నారు. సుప్రీం, హైకోర్టు తీర్పుల ప్రకారం ఎన్‌కౌంటర్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. రాత్రి పోస్టుమార్టం చేయించమే అది బూటకపు ఎన్‌కౌంటర్ అని అర్థమవుతోందన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణుల మధ్య పోస్టుమార్టం చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
విశ్వబ్రాహ్మణులుగానే పరిగణిస్తాం : రాష్ట్ర ప్రభుత్వం
విశ్వబ్రాహ్మణ కులంలోని ఉప కులాలన్నింటినీ ఒకటిగానే పరిగణిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ సర్వేలో వేర్వేరు సబ్ కేటగిరీలుగా ఉన్నా వాటిని ఒకే కులంగా పరిగణిస్తామని చెప్పింది. విశ్వబ్రాహ్మణుల ఉప కులాలను వేర్వేరు కులాలుగా పరిగణిస్తూ సర్వే నిర్వహించడం అన్యాయమంటూ విశ్వబాహ్మిన్ అడ్వకేట్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం పై విధంగా హామీ ఇవ్వడంతో విచారణను ముగిస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు.