పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం అర్బన్ డే ను నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించారు. కార్మికులకు వైద్యులు పరీక్షించి మందులను అందించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ మేళాలలో వంటల ప్రదర్శనను తిలకించారు. పలు రకాల వంటకాల రుచులను చూసి అభినందించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించి మెమోంటోలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… పట్టణం పరిశుభ్రంగా ఉండడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ ఎంతో ఉందన్నారు. వారు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చే మందులను నిరంతరం వాడాలని సూచించారు. వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని, జనరల్ ఫండ్ లో మున్సిపల్ కార్మికుల వేతనాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాతపూర్వకంగా ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈఎస్ఐ, పీఎఫ్ వచ్చేల కూడా కృషి చేస్తామన్నారు. అదే విధంగా ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి శక్తి క్యాంటిన్లు, ఇతర రంగాల్లో రాణించేల అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, ఇన్చార్జి కమిషనర్ తిరుపతి, మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.