సిగ్గుపడవలసింది ఎవరు కామ్రేడ్‌?

”కొంచెం సిగ్గుగా ఉంది కామ్రేడ్స్‌” అనే శీర్షికతో చెరుకూరి సత్యనారాయణగారి వ్యాసం ఆంధ్రజ్యోతి పత్రికలో జూన్‌ 11న ప్రచురిత మైంది. శ్రామికవర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తూ భూస్వాములచేత, పోలీసులచేత, అధికారపార్టీ వాళ్ళ చేత చంపబడిన కార్యకర్తల పట్ల మన ఎర్రజెండా పార్టీలెప్పుడైనా బాధ్యత తీసు కున్నాయా అని అంటూ ఇంకా కొన్ని ప్రశ్నలు సంధించారు. వారి ప్రశ్నలలోని కొన్ని విషయా లకు సమాధానంగా, ఒక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా (హౌల్‌ టైమర్‌) నా అనుభవాలను పాఠకుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను…
నేను 1976 నుండి అదిలాబాద్‌ జిల్లా (ప్రస్తుతం మంచిర్యాల) భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిర్మాణంలో పాలుపంచుకుంటూ 2017లో జిల్లా కార్యదర్శిగా బాధ్యతల నుండి (వయస్సు రీత్యా) రిలీవ్‌ అయ్యాను. పార్టీలో పనిచేసే పూర్తికాల కార్యకర్తల పిల్లల విద్యకు విజయవాడలోని నేతాజీ స్కూలు, వైరాలోని మధు విద్యాలయాలు బాధ్యత వహించాయి. ఆర్థిక పరిస్థితిని బట్టి ఫీజు రాయితీలు ఇస్తూ ఉండేవారు. పాఠశాల విద్య ముగిసిన తర్వాత ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం వారి ఉన్నత చదువులకు బాధ్యత స్వీకరించి వారి ఆసక్తి మేరకు చదివించడం జరిగినది. ఆ విద్యార్థులు తరువాత ఇంజనీర్లు, టీచర్లు, బ్యాంకు ఉద్యోగులు, పార్టీ పూర్తికాలం కార్యకర్తలుగా తమ తమ అభిరుచికి అనుగుణంగా పని చేసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రగతి విద్యానిలయం వాటికి తోడైంది. చిలుమూరు, గుంటూరులలో అలాంటి స్కూళ్ళు నడుస్తున్నాయి.
కార్యకర్తల కుటుంబాలలో ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఆస్పత్రులలోనూ, ప్రయివేటు ఆసుపత్రుల లోనూ పనిచేస్తున్న మాతో సత్సంబంధాలు కలిగి ఉన్న వైద్యుల సహకారంతో వారికి సహాయం అందించడం జరుగుతున్నది. అత్యవసరమైతే హైదరాబాద్‌కు, లేదా నెల్లూరు ప్రజావైద్యశాలకు పంపించి వైద్యం చేయించే బాధ్యతను పార్టీ రాష్ట్ర కేంద్రమే తీసుకునేది. అంతేకాక పార్టీ సభ్యులైన అనేక మంది డాక్టర్లు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ స్వచ్ఛందంగా ప్రజావైద్యశాలలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలకూ, సభ్యులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా వైద్యసేవలు అందిస్తున్న విషయం జగమెరిగిన సత్యం. పార్టీ కార్యకర్తలు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థికసహకారం అందించి నిలబెట్టడం జరిగేది. తాత్కాలిక సహాయం అందించడంతో సరిపుచ్చక వారి విద్యా స్థాయిని బట్టి వారికి శాశ్వత ఉపాధి కల్పనకు పార్టీ తన శక్తి మేరకు కృషి చేసింది. విద్యుత్‌ పోరాటంలోనూ, ముదిగొండ కాల్పులలోనూ అమరులైన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆయా కుటుంబాలను నిలబెట్టింది. వారి పిల్లలు పెద్ద వారై ప్రస్తుతం ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
అమర వీరుల విషయంలో మరొక వికృత కోణం కూడా ఉంది అంటూ 1964, 1968లలో పార్టీ చీలిన తర్వాత తమ నుండి విడిపోయిన వారు ఎంతటి త్యాగధనులైన ఉద్యమకారులైనా గుర్తించరు అనడం పాక్షిక సత్యమే. సీపీఐ(ఎం)కు సంబంధించి నంత వరకు 1976లో కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి అమరు డైనప్పుడు అత్యవసర స్థితి కారణంగా రహస్య జీవితం గడుపుతున్న కామ్రేడ్‌ సుందరయ్య, నీలం సంజీవరెడ్డి ద్వారా సోదరి లక్ష్మికి నా సంతాపం తెలపడం తప్ప మరేమీ చేయగలను అని తన అశక్తతను తెలియజేస్తూ సుదీర్ఘమైన లేఖను రాశారు. కామ్రేడ్‌ కొల్లా వెంకయ్య అమరుడైనప్పుడు సీపీఐ నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ విశాలాంధ్ర పత్రికలో ఒక వ్యాసమే రాశారు. అంతేకాదు అత్యవసర స్థితి కాలంలో వెంగళరావు ప్రభుత్వం జరిపిన బూటకపు ఎన్‌కౌంటర్లలో అమరులైన కామ్రేడ్ల విషయంలో విచారణకు భార్గవ కమిషన్‌ను ఏర్పాటు చేయడంలో సీపీఐ(ఎం) ప్రత్యేకించి కామ్రేడ్‌ సుందరయ్య చేసిన కృషి మరువ లేనిది.
తెలుగు నేలలో తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆ తరువాత జరిగిన పోరాటాలలోనూ అమరులైన వారిని గురించి, వారి కుటుంబాల ప్రస్తుత స్థితి గతులపై లెక్క ఏ ఎర్రజెండా పార్టీ అయినా చెప్పగలదా? అని మరొక ప్రశ్న సంధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 1983మంది అమరుల పేర్లను జిల్లా, తాలూకాలవారీగా 1973లో ప్రచురించిన సుందరయ్య గారి రచన ”వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణ పాఠాలు”లో ప్రచురించారు. ఆ తరువాత ఈ శతాబ్దంలో సీపీఐ(ఎం)కు చెందిన ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా కమిటీలు వారికి అందుబాటులో ఉన్న అమరుల చరిత్రను సంక్షిప్తంగా వివరిస్తూ పుస్తకాలు ప్రచురించారు. ఇందులో గుంటూరు జిల్లా కమిటీ ప్రచురించిన 642 పేజీల గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు అన్న పుస్తకం పాత గుంటూరు జిల్లా అంటే పొరాట కాలంనాటి గుంటూరు జిల్లాకు చెందిన అమరుల చరిత్రను ఎంతో శ్రమకు ఓర్చి అమరుడు కామ్రేడ్‌ హరిబాబు, మిత్రులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, వాసిరెడ్డి నాగేంద్ర ప్రసాద్‌ల సహకారంతో సేకరించగా ప్రొఫెసర్‌ ఎం.వి.ఎస్‌., కోటేశ్వరరావు, శ్రీమతి సుధాకిరణ్‌ గార్లు సంకలనం చేశారు. ఇంకా మరొక సంపుటికి సరిపడా అమరుల సమాచారం కూడా సేకరించబడినది, కానీ మిత్రుడు హరి అకాల మరణంతో ప్రచురణకు నోచుకోలేదని తెలిసింది. మిత్రుడు చెరుకూరి సత్యనారాయణ లోకేష్‌, భువనేశ్వరి గురించి రాయడానికి సమాచారం సేకరణకు వెచ్చించిన సమయంలో కొంతైనా వీటికోసం వెచ్చించే ప్రయత్నం చేస్తే సీపీఐ(ఎం), ఇతర కమ్యూనిస్టు పార్టీలు ఈ దిశగా చేసిన కృషి తెలిసి ఉండేది.
చివరగా సీపీఐ(ఎం) శాసన సభ్యులు తమ వేతనాలను మొత్తం పార్టీకే చెల్లించి కడు పేదరికంలో గడిపారని కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. పార్టీ అనుసరిస్తున్న విధాన పరంగానే శాసనసభ్యులే కాదు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ తమ వేతనాలను పార్టీకి చెల్లించి, పూర్తికాలం కార్యకర్తలు మాదిరిగా అలవెన్సులు తీసుకుం టారు. పదవీ విరమణ తరువాత కూడా అవసరం ఉన్న వారికి అలవెన్సులు అందు తున్నాయి. అంతేకాదు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో కేటాయించిన ఇండ్ల స్థలాలను కూడా తిరస్కరించారు సీపీఐ(ఎం) శాసనసభ్యులు.
బూర్జువా పార్టీలకున్నట్లు కమ్యూనిస్టు పార్టీలకు ఆర్థిక వనరులు ఉండవు ఆ కారణంగా జరగవలసినంత కృషి జరగలేదన్నది వాస్తవం. అయితే చెరుకూరి సత్యనారాయణ రాసిన వికృత కోణం తమ నుంచి విడిపోయిన లేదా విభేదించిన వారిని అతి దారుణంగా నిందించడం, కొన్ని సందర్భాలలో హత్య చేయడం, ప్రత్యేకించి సీపీఐ(ఎం)పైనా, పార్లమెంటరీ పోరాటాన్ని కూడా ఒక పోరాట మార్గంగా గుర్తించిన వామపక్షాల పైనా అలుపెరగకుండా నిందలు వేయడం, వర్గ శత్రువు పట్ల సరళంగా ఉండటం చేస్తున్నది ఎవరో, సిగ్గుపడవలసింది ఎవరో మీరే నిర్ణయించండి కామ్రేడ్‌.
సూర్యదేవర సత్యనారాయణ