మట్టి పిడికిళ్లు

Clay fistsగంగిగోవులు గాండ్రిస్తున్నాయి
అన్నం ముద్దలు నిప్పురవ్వలై
ఎగసిపడుతున్నాయి
మట్టి చేతులు గట్టి పిడికిళ్లు
బిగిస్తున్నాయి
దేశపు తలరాత రాసే అన్నదాత కొంపాగోడూ వదలి అన్నం నీళ్లు మాని
ఆక్రోశంతో అందరికీ పిలుపిస్తున్నాడు
వ్యవసాయ చట్టాల చిట్టా పట్టుకొని
ఇంద్రప్రస్థానికి తరలివస్తున్నాడు
పరిహారం, ప్రయోజనాలిచ్చే
ఐదు ప్రధాన డిమాండ్లు కోరుతూ
అణగారిన ఆశల్ని తట్టి లేపుతున్నాడు
భవిష్యత్‌ భారతాన్ని అంధకారంలోకి నెట్టొద్దంటూ గద్దెనెక్కిన పెద్దల్ని
హెచ్చరిస్తున్నాడు
కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే
దిక్కుమాలిన పాత చట్టాలకు పాతరేసి
కష్టానికి చట్టబద్ధత కల్పింపజేసి
నవభారతాన్ని లిఖించేందుకు
కలిసికట్టుగా నడుం కడుతున్నాడు
పాలకుల్లో చలనం ప్రజల్లో చైతన్యం
తెచ్చేందుకు సరిహద్దుల అవలనుంచి
ఢిల్లీవైపు దూసుకొస్తున్నాడు
– భీమవరపు పురుషోత్తమ్‌,
9949800253