– నేడు భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే
బ్రిస్బేన్ : వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమయ్యే ముందు భారత మహిళలజట్టు పటిష్ట ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. బ్రిస్బేన్ వేదికగా గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీి టి20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న ఉత్సాహంతో ఈ పర్యటనకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధమైంది. ఇక ఆస్ట్రేలియా జట్టు వరుసగా 16 వన్డేల్లో విజయాల రికార్డును మరింత పటిష్టం చేసుకొనే ప్రయత్నంలో ఉంది. భారతజట్టు ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై కేవలం నాలుగు వన్డేల్లో మాత్రమే విజయాలను నమోదు చేసుకోగా.. చివరిసారిగా 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది.
ఈ ఏడాది మార్చి తర్వాత ఆసీస్ మహిళల జట్టు తొలిసారి వన్డే సిరీస్‌లో పాల్గోనుంది. రెగ్యులర్ కెప్టెన్ అలైసా హీలీ మోచేతి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. తాహియా మెక్ గ్రాత్ సారథ్యంలో ఆసీస్ బరిలోకి దిగుతోంది. భారతజట్టు వైస్ కెప్టెన్ స్మృ తి మంధాన చివరి ఆరు వన్డేల్లో 75యావరేజ్‌తో ఏకంగా 448పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ ఏడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరడంలో విఫలం కావడంతో హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఆసీస్‌తో జరిగిన చివరి రెండు వన్డేల్లో హర్మన్ రెండంకెల స్కోర్ చేయడంలో విఫలమై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రాణిస్తే భారత్ భారీస్కోర్ నమోదు చేయడం ఖాయం.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో గాయపడ్డ వికెట్ కీపర్ యాస్టికా భాటియా లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. ఆమె స్థానంలో ఉమా ఛెత్రీ టీమిండియా జట్టులో తొలిసారి చోటు దక్కించుకుంది. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రీచా ఘోష్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా.. హర్లిన్ డియోల్, మిన్ను మణికి తొలి వన్డేలో చోటు దక్కడం ఖాయం. తొలి వన్డే జరిగే బ్రిస్బేన్‌లో వాతావరం వేడి, తేమతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది.
జట్లు…
ఇండియా : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), మంధాన(వైస్ కెప్టెన్), ప్రియ పునియా, రోడ్రిగ్స్, హెర్లిన్ డియోల్, ఉమా ఛెత్రీ, రీచా ఘోష్(వికెట్ కీపర్), తేజల్, దీప్తి, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సద్ధు, అరుంధతి రెడ్డి, రేణుక, సైమా ఠాకూర్
ఆస్ట్రేలియా : తానియా(కెప్టెన్), గార్డినర్(వైస్ కెప్టెన్), బ్రౌన్, కిమ్ గరాత్, కింగ్, లిచ్‌ఫీల్డ్, సోఫియా, మూనీ, పెర్రీ, స్కట్స్, సథర్లాండ్, జార్జియా వోల్, వారేహామ్.
షెడ్యూల్…
డిసెంబర్ 5 : తొలి వన్డే (బ్రిస్బేన్)
డిసెంబర్ 8 : రెండో వన్డే(క్వీన్స్లాండ్)
డిసెంబర్ 11 : మూడో వన్డే(వాకా)