నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనల సందర్భంగా మహబూబాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ముందస్తు పేరుతో అక్రమంగా అర్ధరాత్రి ఇండ్లపై పడి అరెస్టు చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటన చేసినా మానవ హక్కులను హరించి పోలీసులు అర్ధరాత్రి ఇండ్లపై దాడి చేసి మరీ అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు. రాజ్యాంగ హక్కులు రాష్ట్ర పోలీసులు కాలరాస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అధ్యక్షులు, కార్యదర్శులతోపాటు ఇతర నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటు : పీడీఎస్‌యూ
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జిల్లాల పర్యటనల సందర్భంగా పీడీఎస్‌యూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని ఆ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్, ప్రధాన కార్యదర్శి ఎస్‌వి శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పర్యటనల సందర్భంగా పీడీఎస్‌యూ నాయకులను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం సరైంది కాదని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి విద్యారంగ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.