సామాన్యులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై సమాజంలో జరుగుతున్న దాడులను అరికట్టాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సోమారపు ఐలయ్య అన్నారు. గురువారం మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్ ఆధ్వర్యంలో చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మధ్యాహ్నం బోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య, సతీష్ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని మందలించాడనే నేపంతో వ్యాయామ ఉపాధ్యాయుడు వడన్న పై సదరు విద్యార్థి తండ్రి దాడి చేయడాన్ని ఉపాధ్యాయ లోకం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకొని తమ విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడానికి ఒక వైపు ప్రయత్నిస్తుంటే…దాన్ని నెపంగా తీసుకొని ఉపాధ్యాయులపై విద్యార్థుల తల్లిదండ్రులు, వారి సంబంధీకులు ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకొని భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అన్నారు. విద్యా బుద్దులు నేర్పుతున్న ఉపాధ్యాయులపై ఆకారణంగా దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేటి విద్యార్థులు, యువత సామాజిక రుగ్మతలకు అలవాటు పడి, సామాజిక మాధ్యమాల ద్వారా చెడు లక్షణాలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సమాజంలో సరైన రీతిలో ప్రవర్తన నియమాలు, నైతిక విలువలను నేర్పుతూ.. విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల పైన దాడి చేయడం అమానుషం అన్నారు. ఈ ఘటన తో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయచోడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు యాజస్ అహ్మద్ పై విద్యార్థులు, బయటి వ్యక్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరణించిన ఉపాధ్యాయుడికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునారావృత్తం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థులను చక్కదిద్దే చొరవను ఉపాధ్యాయులు తీసుకోలేరని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులకు, సమాజానికి మధ్య అంతరాలు ఏర్పడడానికి ప్రభుత్వ విధానాలే కారణమని బహిరంగంగా ప్రభుత్వ పెద్దలు ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడడమే ఇలాంటి ఘటనలకు కారణం అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకయ్య, యుగేంధర్, నరేష్, మల్లేశం, కోటేశ్వర్, హరిసింగ్, విజయలలిత, రమేష్, ప్రభాకర్, రాజేందర్, విద్యాసాగర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.