నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 349 లో గల 7.24 గుంటల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల కు కేటాయించాలని డిచ్ పల్లి తాహసిల్దార్ ప్రభాకర్ కు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ మండల కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఘన్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్లాంపూర్ ,గన్ పూర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. నిరుపేద ప్రజలు అనేక సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని, సరైన ఉపాధి లేకపోవడం, పిల్లల స్కూలు ఫీజులు, పెరిగిన నిత్యవసర ధరలు తట్టుకోలేక పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కుటుంబాలను గడుపుతున్నారని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వస్తే నిరుపేదలకు పక్కా ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని, అలాగే సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారని గూర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అన్నారు. నూతన రేషన్ కార్డులు ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సాయ గౌడ్, డివిజన్ నాయకులు మోహన్, కిషన్, భాగ్య, శారద, వడ్డెవ్వ, సుజాత ,జమున, లక్ష్మి, గంగమని తదితరులు పాల్గొన్నారు.