ప్రజాపాలన వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సహజంగానే అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడెక్కడా? అని ఎవరైనా చూస్తారు. కేసీఆర్ ”ఉంటే ప్రగతిభవన్ లేకపోతే ఫామ్‌హౌస్” అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మధ్య అపహాస్యం చేశారు. దాన్ని కేసీఆర్ నిజం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు చార్జిషీట్ పేరుతో దాడి చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మూసీ, హైడ్రా, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ పేరుతో హైదరాబాద్ చుట్టూ రాజకీయం తిప్పుతున్నది. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కూడా దాని చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల స్థానంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముందుకొస్తున్నాయి. మరి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రేవంత్ పాలనను ‘ప్రజాపాలన’ అనవచ్చా?
ప్రజలు కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం వైపు చూస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, తొంభై వాగ్దానాల అమలు ఎంతవరకు వచ్చిందన్నదే ప్రశ్న. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, మిగిలిన ఆరు గ్యారెంటీల్లో ఏదీ సంతృప్తికరంగా అమలు జరగలేదు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ప్రకటించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. ఈ విషయం ఎన్నికలకు ముందు తెలియందికాదు. తెలిసి చేసిన వాగ్దానాల అమలుకు డబ్బులేదన్న సాకు చూపడం అభ్యంతరకరం. ప్రభుత్వానికి పైసా ఖర్చులేని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వలేదు. గుడిసెవాసుల పోరాటం, ఆర్టీసీ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు రద్దు చేయలేదు. కోటి మంది కార్మికుల కనీసవేతనాలు సవరించలేదు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు వర్తింపజేయలేదు. వీటికి ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం పడదు.
ప్రగతి భవన్ ముందు బారికేడ్స్ పోలీసులు ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రగతిభవన్ పేరు ప్రజాభవన్‌గా మార్చారు. కానీ ఐదు జిల్లాల్లో వేలాది గుడిసెలను పోలీసులు ధ్వంసం చేశారు. మహిళలను చిత్రహింసలు పెట్టారు. గుడిసెవాసులను, నాయకులను నెల రోజులపాటు జైలుపాలు చేశారు. ఫార్మాసిటీ పేరుతో లగచర్ల రైతులనుంచి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన రైతులపైన ఉక్కుపాదం మోపారు. జీవో నంబర్ 29 పేరుతో గ్రూప్-1 పరీక్షలు రాసే అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించారు. రాత్రంతా రోడ్డుమీద బైఠాయించిన వారిని అరెస్టు చేశారు. మూసీ పునరుద్ధరణ పేరుతో పన్నెండు వేల ఇండ్లు కూల్చివేతకు ప్రయత్నిస్తున్నారు. హైడ్రా పేరుతో అమీన్‌పూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల ఇండ్లు ధ్వంసం చేశారు. స్కీమ్ వర్కర్స్ చలో హైదరాబాద్‌కు అనుమతులిస్తూనే వేలాది మందిని హైదరాబాద్ చేరకుండా నిర్బంధించారు. హైదరాబాద్ మహానగరంలో బహిరంగసభలు, ధర్నాలు, ప్రదర్శనలు, ప్లకార్డుల ప్రదర్శనలు తదితర నిరసన రూపాలను నిషేధించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లిన జిల్లాల్లో ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నాయకులను అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? ఏమైనా ప్రజల ప్రతిఘటన ఫలితంగా ఫార్మాసిటీని, నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
దేశవ్యాప్తంగా బీజేపీతో రాజకీయంగా తలపడుతున్న పార్టీ కాంగ్రెస్. కానీ ఆర్థిక విధానాల్లో మాత్రం ఈ రెండు పార్టీలకు తేడాలేదు. మోడీ ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో విద్యను కార్పొరేట్‌పరం చేస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానినే అమలు జరుపుతున్నది. కార్పొరేట్ సంస్థల సహాయంతో స్కిల్ యూనివర్సిటీ ప్రారం భిస్తున్నది. ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలకు తగిన నిధులు కేటాయించి, మౌలికవసతులు కల్పిస్తే ఇవన్నీ స్కిల్ యూని వర్సిటీలుగా మారుతాయి. ప్రభుత్వ విద్యాలయాలలో తగిన నిధులు కేటాయిస్తే విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతారు. ఈ విషయం పట్టించుకోకుండా మండల కేంద్రంలో అంతర్జాతీయ పాఠశాలలు ప్రారంభిస్తామంటున్నది. సింగరేణిలో బొగ్గుబ్లాకుల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది.
జీఎస్టీ పేరుతో వనరులన్నీ కేంద్రం గుప్పెట్లో పెట్టుకున్నది. నిధుల కేటాయింపునకు జనాభా ప్రాతిపదికతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా కుటుంబ నియంత్రణను అమలు జరిపిన రాష్ట్రానికి నిధులు కోత పెడుతున్నది.అంతేకాదు, తమను రాజకీయంగా వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నది. చట్ట ప్రకారం రావాల్సిన నిధులు కూడా సకాలంలో ఇవ్వకుండా వేధిస్తున్నది. విభజన హామీలు అట్లనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలను సమీకరించి కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా న్యాయం జరగదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధపడట్లేదు. మోడీ ప్రభుత్వం ఈడీ అధికారులతో దాడులు చేయిస్తుందన్న భయంతోనే కేంద్రంతో ఘర్షణకు సిద్ధపడడం లేదన్న అనుమానాలకు అవకాశమిసున్నది. ప్రజల్లో మతపరమైన విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీతో రాజ కీయంగా తలపడేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడటంలేదు. ఏడాదిలో అనేక సందర్భాల్లో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాయి. మైనారిటీల మీద దాడులు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూసింది. కానీ లౌకిక విలువల పరిరక్షణ రాజకీయ సమస్య. లౌకిక పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగాని, రాష్ట్ర ప్రభుత్వంగాని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీజేపీ చర్యలను ఖండించలేదు. రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయలేదు. స్థూలంగా ఏడాది పాలన కాలంలో ప్రజలకు మాటలు, బడా బాబులకు మూటలు దక్కాయి. కనీస వేతనాలు సరిగా సవరించనందువల్ల యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులు బాగా లాభ పడు తున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రారంభిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, ఫార్మాసిటీ, పారిశ్రామిక కారిడార్, ఫ్యూచర్ సిటీ గాని పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేవే. హైడ్రా పేరుతో అధికార పార్టీ నాయకులు, అధికారులు, కబ్జాదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో పేద ప్రజల సమస్యలు వామపక్షాలు తప్ప, మరెవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలకు అందుబాటులో లేకుండా ఫాంహౌస్‌కు పరిమితమయ్యే నాయకులు శాసనసభ్యులుగా, ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఉపయోగం ఏమిటి? భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అంటున్నారు కేటీఆర్. కేంద్రంతో కొట్లాడని ఏ ప్రాంతీయ పార్టీకి దేశంలో తగు స్థానం దక్కలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాల పట్ల గాని, రాష్ట్రంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే బీజేపీ ఎత్తుగడల పట్ల గాని బీఆర్‌ఎస్ స్పందించడంలేదు. కవితను జైలుకు పంపడం వల్ల బీఆర్‌ఎస్ నాయకత్వం భయపడుతున్నదన్న అభిప్రాయం బలపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రం మూడో కాలుమీద లేస్తున్నది. ఏ ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని కేటీఆర్‌కు అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత అర్థమైంది. కేసీఆర్‌కు అదికూడా అర్థమైనట్టులేదు.
రాష్ట్ర ప్రభుత్వం మీద చార్జిషీట్ విడుదల చేసిన బీజేపీ నాయకత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనన్న విషయం మరచిపోతున్నది. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ధరల తగ్గింపు లాంటి వాగ్దానాలన్నీ విస్మరిస్తున్నది. కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద-కౌలు రైతులు, వృత్తిదారులు, బడుగు బలహీనవర్గాల ప్రజల సమస్యలు ఈ పట్టవు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పేరుతో నడిపిన రియల్ ఎస్టేట్ దందా లాంటిదే మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు కూడా. దీనికి మాత్రం బీజేపీ సమాధానం చెప్పదు. క్లీన్ గంగా పేరుతో గంగానది ప్రక్షాళనకు రు.40వేల కోట్లు ఇచ్చిన కేంద్రం మూసీ ప్రక్షాళనకు ఎందుకివ్వదో జవాబు చెప్పదు. అయితే ప్రజల మధ్య మతచిచ్చు పెట్టడం లేకుంటే ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చటం పనిగా పెట్టుకున్నారు ఆ పార్టీ నాయకులు. గత ఏడాది కాలంలోనే బక్రీద్ పండుగ సందర్భంగా ఐదు జిల్లాల్లో మైనార్టీల మీద దాడులు చేశారు. జైనూర్‌లో విధ్వంసం సృష్టించారు. ఉట్నూర్‌లో వ్యక్తిగత ఘర్షణను మత ఘర్షణగా మార్చారు. సమక్క, సారక్క జాతరలో కూడా విద్వేశ విషబీజాలు ప్రచారంలో పెట్టారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, పాతనగరం భూలక్ష్మీ గుడి సంఘటనల సదర్భంగానూ చిచ్చుపెట్టేందుకే ప్రయత్నించారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రధాని మోడీ మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకోవాలని ఉపదేశించారు. ప్రధాని నుంచి ఉత్సాహం పొందిన బీజేపీ నాయకులు బండి సంజరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులే కూల్చివేస్తారన్నారు. అంటే కాంగ్రెస్ నాయకులతో మంతనాలకు ప్రయత్నిస్తున్నారన్నమాట.
స్థూలంగా గతేడాది కాలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలు విస్మరించారు. స్వప్రయోజనాలకు, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చారు. ప్రజల్లో మాత్రం క్రమంగా అసంతృప్తి పెరుగుతున్నది. వామపక్షాల కదలికపైననే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉన్నది.
ఎస్.వీరయ్య