శైలజ కుటుంబానికి రూ.2 లక్షల విరాళం

– యువతకు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మోసం
– హామీల అమలుపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని శైలజ మరణించడం బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరలో వాంకిడిలో పర్యటించి శైలజ కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన తెలంగాణ జాగృతి నాయకులతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..యువవికాసం కింద ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యాజ్యోతుల పథకం కింద ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తిచేసిన ఎస్సీ,ఎస్టీ యువతకు ఇస్తామన్న రూ.5 లక్షల హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.3 లక్షల లోపు ఆదాయమున్న బీసీలకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని హామీ ఏమైందని నిలదీశారు. ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతున్నదని విమర్శించారు. మహిళలకు రూ.2500 ఎప్పటి నుంచి చెల్లిస్తారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. లీటర్‌ పెట్రోల్‌ రూ.40 కే ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. బూటకపు హామీలతో తెలంగాణ యువతను రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. హామీల కోసం కాంగ్రెస్‌ నేతలను గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.