మానవ హక్కుల గురించి మనం భారత దేశంలో చర్చించేటప్పుడు కులం, పెట్టుబడి (కాస్ట్ అండ్ కాపిటల్) కేంద్రంగా చర్చించాలనిపిస్తుంది. కులం, పెట్టుబడి రెండూ కూడా దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కొందరం కులం విషయంలో కళ్ళుమూసుకుంటే మరి కొందరం పెట్టుబడి తెచ్చిపెట్టే అనర్ధాలను చూసీ చూడనట్టు వదిలేసాం. ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మార్పుల తీవ్రత, వేగం రెండూ కూడా అర్ధం చేసుకోవడంలో, ఎదుర్కోవడంలో మనం విఫలం అయ్యామనే చెప్పాలి. కులం, పెట్టుబడి ఈ రెండు అంశాలని, నేడు మన ఉనికికే ఓ సవాలుగా నిలిచిన ఫాసిస్ట్ ధోరణులకు ప్రధానమైన పునాదిగా గుర్తించాలి. డిసెంబర్ 10న మానవహక్కుల దినోత్సవం సందర్భంగా మరింత సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం, సమానత్వం వంటి ప్రాథమిక హక్కులు ఒక వైపు అయితే ఆర్థిక, రాజకీయ హక్కులు కూడా రాజ్యాంగం మనకి ఇస్తుంది. మనం ఆస్తికులుగా ఏ దేవుళ్ళని కొలవచ్చు, మన లాంటి ఇతరులతో కలిసి సంఘాలుగా ఏర్పడటం, వ్యక్తిగత సమాచారం గోప్యత, న్యాయ స్థానాలలో సమాన ఆదరణ, సమన్యాయం పొందే హక్కులు కూడా పౌరులు అందరికీ ఉంటాయి. కానీ నేటి వాస్తవాలు ఈ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయని ఒప్పుకోక తప్పదు. ఎప్పుడూ హక్కులు అంతంత మాత్రంగానే అమలు అయినప్పటికీ 2014 తర్వాత మాత్రం ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఓ పథకం ప్రకారం హిందుత్వ పోకడలకు అనుగుణంగా ఈ హక్కులు కొందరికే వర్తించే దిశగా, సమాజాన్ని మలిచే ప్రయత్నాలు ముమ్మరం అయినాయి.
కుల, మత వివక్ష
ఆ ప్రయత్నాల్లో ఇదివరకు లేని కొన్ని ముఖ్యమైన ఎత్తుగడలు కనిపిస్తాయి. ఇంట్లో గానీ, బయటగానీ గొడ్డు మాంసం ఒకరి దగ్గర ఉందన్న ఆరోపణ ప్రముఖంగా ముస్లింల మీద, దళితుల మీద ప్రయోగించటం, దానిని ఒక భయంకరమైన నేరంగా, అవసరమైతే ఉన్మాదంతో రోడ్ల మీద కొట్టి చంపవచ్చు అనే ఒక విశృంఖలత్వాన్ని సమాజానికి పరిచయం చేశారు. ఇది ఒక పక్క ఆవు పవిత్రత, పూజనీయతని ముందు పెట్టి, హిందుత్వంలో ఉన్న క్రూరమైన వివక్ష భరించలేక వేరే మతాలు స్వీకరించి సమానత్వం ఆకాంక్షించే వాళ్ళ మీద, హిందుత్వం నిర్దాక్షిణ్యంగా వెలివేసిన దళిత సమాజం మీదా దాడి చేయడమే.
ఈ రకం దాడులు…
2015లో దాద్రిలో అఖ్లాఖ్ అనే 52 ఏండ్ల ముస్లిం వ్యక్తిని రాత్రి 10.30కి అంతా నిద్రపోతున్న సమయంలో దుండగులు ఇంట్లోకి జొరబడి కొట్టి చంపడంతో మొదలై, 2016లో ఊనలో మాంసం చేరవేస్తున్నారు అని దళితులని రోడ్డు మీద ఆపి కొట్టడం వంటి సంఘటనలతో ఊపందుకుంది. ఇటువంటి సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. సుప్రీం కోర్టు 2018లో ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్న అరెస్ట్ అంశం కొట్టివేసినప్పుడు దళితులు జాతీయ స్థాయిలో బంద్కు పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దళితుల ఆగ్రహాన్ని తట్టుకోలేక ప్రభుత్వం అరెస్ట్ అంశాన్ని చట్ట సవరణ ద్వారా మళ్ళీ చేర్చవలసి వచ్చింది. ఈ ఉదంతం తర్వాత దళిత చైతన్యాన్ని అణచి వేసే ఎత్తుగడలు ప్రారంభం అయ్యాయి.
అరాచకత్వం
దేశంలో దళితులకి, ముస్లింలకి పౌర సత్వపు అధికారాలు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ గొంతులు అణిచి వేసే ప్రయత్నంలో అతి ముఖ్యమైన ఘటనలు రెండు. ఒకటి భీమకోరెగావ్ ఘటన, రెండవది ఢిల్లీలో జరిగిన అల్లర్లు. ఈ రెండు సందర్భాలూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎంత అరాచకంగా వ్యవహరించగలదో మనకు కళ్ళకి కట్టినట్టు తెలుపుతాయి. భీమాకో రేగావ్ కేసులో మొదట ఆరోపితులుగా పేర్కొన్న వాళ్లు మిలింద్ ఎక్బోటే, శంభాజీ భిడే. దళితులు 1925 నుంచి ప్రతి ఏటా చేసుకునే ఈ విజయోత్సవాన్ని 2018లో ఒక హిం సాత్మక ఘటనగా మార్చేసింది భిడే, ఎక్బోటే వంటి బ్రాహ్మణీయ హిందుత్వ నాయకులే. పోలీస్ రిపోర్టుల్లో మొదటగా వీళ్ళ పేర్లే వచ్చాయి. పోలీసులు, ప్రభుత్వం కలిసి ఆ కేసును తలకిందులు చేసి ఆ ఉత్సవంతో ఎటువంటి సంబంధం లేని మానవ హక్కుల కార్యకర్తలందరిని అరెస్టులు చేసి గత 4-5 ఏండ్లుగా జైళ్లల్లో మగ్గిస్తున్నారు. ఈ కార్యకర్తలందరూ దళితుల, ఆదివాసీల న్యాయ పోరాటాలకు ముందు వరుసలో ఉండి మద్దతు ఇచ్చే వాళ్ళే. వాళ్లకి మీడియా ద్వారా అతివాదులని, నక్సల్స్ అని ఎన్ని పేర్లు పెట్టినా వాస్తవానికి అంతా దళితుల, ఆదివాసీల జీవించే హక్కు, భూమి హక్కులని కాపాడే పనే చేస్తున్నారు. సుధా భరద్వాజ్, సురేష్ గడ్లింగ్ వంటి లాయర్లు ఐనా, గౌతమ్ నవలఖ వంటి హక్కుల కార్యకర్తలైనా చేసేది హక్కుల పోరాటమే.
సీఏఏ, ఎన్నార్సీ ఉద్యమాల్లో
ఒక్క భీమా కోరేగావ్ కేసుతో దళిత చైతన్యాన్ని అణిచి, రాజకీయంగా దెబ్బతీయటంలో ప్రభుత్వం కొంత వరుకు విజయవంతం అయిందనే చెప్పాలి. అరెస్ట్ అయిన వ్యక్తులు జైళ్లల్లో, కోర్టులలో పడే యాతనలు చూసి పౌర సమాజంలో చాలామంది కార్యకర్తలు మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు. స్టెన్ స్వామి లాంటి వృద్ధులను జైల్లో వేసి మంచినీళ్లు దొరకకుండా చేశారు. వ్యవస్థ అనైతికతని, దేశంలో న్యాయవ్యవస్థ వున్న దుస్థితిని చూసి కూడా పౌర సమాజం దిగ్బ్రాంతిలో ఉంది. ముస్లిం పౌరసత్వానికి సంబంధించి దేశ వ్యాప్తంగా జరిగిన సీఏఏ, ఎన్నార్సీ ఉద్యమాల్లో బాగా ముందుండి గళమెత్తిన ముస్లిం యువతీ యువకులని అదను చూసి ఢిల్లీ అల్లర్ల కేసులో ఇరికించి ఇప్పటికీ జైళ్లల్లో పెట్టి, బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇప్పటి వరకు ముస్లిం పౌరసత్వం ఎంత సాధారణ హక్కుగా మనం భావించామో దాన్ని ప్రశ్నార్ధకంగా చేసింది ఈ కేసు.
కనుమరుగు చేయటంలో
ముస్లింల వ్యాపారాలను, ఉపాధులను దెబ్బతీసే విధంగా కొన్ని ప్రదేశాల్లో వాళ్ళ దగ్గర ఏమీ కొనవద్దనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ముస్లిం పేరు చెప్తే, ఇల్లు అమ్మితే, అద్దెకు ఇస్తే కూడా దేశద్రోహం అన్నంతగా ప్రచారం మొదలైంది. ముస్లింలు ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో, తర్వాత దేశ నిర్మాణంలో వహించిన అద్భుతమైన పాత్రని పూర్తిగా కనుమరుగు చేయటంలో హిందుత్వ వాదులు సఫలం అయ్యారు. దళిత సముదాయాల పట్ల కూడా ఇదే జరిగింది. దళిత బహుజన సముదాయాలు ఈ దేశ ఆర్ధిక వ్యవస్థకి వెన్నెముక లాంటివి. ఎక్కడ కూడా ప్రసార మాధ్యమాల్లో గాని, పబ్లిక్ చర్చల్లో గాని మనకు ఈ విషయం వినపడదు. చర్చ అంటూ ఉంటే అది రిజర్వేషన్స్ గురించైనా ఉంటుంది లేదా వాళ్ళు హింసకు గురైనప్పుడు ప్రతిఘటిస్తే వాళ్లనే హింసాత్మక సముదాయాలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది.
హిందుత్వ విష ప్రచారం
2014 వరకు దేశం స్వర్గ ధామం కాక పోయినా, అందరం భవిష్యత్తు మీద ఒక ఆశతో జీవితాలని నిర్మించుకునే ప్రయత్నం చేసాం. మత, కుల హింస, ఘర్షణలు జరిగినా జనం ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించ కలిగే వాళ్లు. హక్కుల గురించి మాట్లేడేందుకు, కోర్టులలో పోట్లాడేందుకు ఒక శక్తివంతమైన పౌర సమాజం ఉండేది. కారంచేడు లాంటి ఘటన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చింది. నిరంతరం పోరాటాలు చేసి దళిత బహుజనులు, ముస్లింలు కొంత ఆర్ధికంగా నిలదొక్కుకోగలిగారు. ఇప్పుడు జరిగే దాడులు వాళ్ళ నుంచి భూములని, ఆర్ధిక వనరులని లాక్కొని, మళ్ళీ పేదరికంలోకి నెట్టివేస్తాయి. మారిన కార్మిక చట్టాల వల్ల పని గంటలు, పని దినాలు, వేతనాల మీద వాళ్లకి నిర్ణయాధికారం ఉండదు. సామాజికంగా కూడా ఈ సముదాయాలకు ఎక్కడా అద్దెకి కానీ, కొనుక్కోవటానికి కానీ ఇల్లు దొరికే పరిస్థితి లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. హిందుత్వ విష ప్రచారం కారణంగా రెండు సముదాయాలలో తీవ్రమైన అనిశ్చితి, భయం మొదలయ్యింది. కానీ ఈ తరుణంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్నీ, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కోర్టులనీ గుప్పిట్లో పెట్టుకుని హక్కుల చర్చని, కార్యకర్తలని పూర్తిగా మటుమాయం చేసే పనిలో ఉంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి ఇస్తోంది.
పెట్టుబడి
భారత దేశంలో రాజకీయ పార్టీలకు ఎప్పుడూ పెట్టుబడి దారుల మద్దతు ఉండేది.(CCI) Competition Commission of India కానీ చురుకుగా మోనోపోలీలని నియంత్రించే ప్రయత్నం చేసేవి. 2014 తర్వాత జరిగిన పరిణామం మోనోపోలీలను బలపరచడం, అదుపులేని ప్రైవేటీకరణ, అది మొత్తం ఒకరిద్దరి చేతుల్లో కేంద్రీకరించటం. జజ× పూర్తిగా బలహీన పడిపోయింది. దేశంలో ఒక రాజ్యాధిపత్యం ఏర్పడి ప్రజాభిప్రాయాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క దేశాన్ని అర్ధికంగా కబ్జా చేసి, తామే నడిపే ప్రసార మాధ్యమాల ద్వారా సామాజిక అనిశ్చితి, అభద్రత సృష్టిస్తున్నారు. దీని వల్ల జనం కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటుంటే ఈ రాజ్యాధిపత్యం తమ ఆర్ధిక సామ్రాజ్యాలని విస్తరించుకుంటున్నాయి. పెట్రోల్, విద్యుత్ రంగాల ప్రైయివేటీకరణ, విచ్చలవిడిగా పెరిగే ధరలు, వ్యవసాయ రంగం మీద నిరంతరం జరిగే దాడి, ఆదివాసీ ప్రాంతాల్లో సహజ వనరుల కబ్జా, ఎదిరించిన వాళ్లని ఉక్కుపాదం తో అణచి వేయటం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో వెల్ఫేర్ స్టేట్ అవగాహనలో ప్రభుత్వాలు భూములు కొందరికైనా పంచాయి. ఇప్పటి ప్రభుత్వాలు ఎదో ఒక నెపం మీద భూములు లాక్కొని జనాన్ని మళ్ళీ నిర్వాసితులను చేసి రోడ్ల మీదకు తెస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, పెట్టుబడి దారుల మధ్య ఏర్పడిన ఈ నిరంకుశ బంధం కారణంగా మొత్తం ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉంది. ప్రజాభిప్రాయానికి, ప్రజల అవసరాలకి సంబంధం లేకుండా ఎన్నికల ప్రక్రియ, తర్వాత జరిగే పాలన నడుస్తున్నాయి.
హక్కుల పునర్నిర్మాణం
ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక అసమానతలని కుల, మత ప్రాతిపదికతో హిందుత్వవాదం పెంచి పోషిస్తోంది. పెట్టుబడి ఆర్ధిక అసమానతలను పెంచుతోంది. రెండూ కలిసి మొత్తం దేశం అగ్రవర్ణ, అగ్రకుల ఆధిపత్యానికి లోబడేట్టు చేస్తున్నాయి. ఇవి రెండూ ఒకదానితో ఒకటి పూర్తి అనుసంధానంతో పనిచేస్తాయి. చూపించుకోవటానికి రకరకాల పేర్లతో ముందుకు వస్తాయి కానీ లక్ష్యం ఒకటే. ఈ రెండింటి కలయికే ఫాసిజానికి నాంది. విషాదం ఏమిటంటే అగ్రవర్ణ కులాల, వర్గాల వాళ్ళే కాకుండా బాధిత సమూహాల నుంచి కూడా కొందరు స్వలాభం కోసం ఈ కూటమికి వంత పాడటం చూస్తాం. మోహ భంగం అయ్యే వరకు, అంటే ఆధిపత్య శ్రేణుల్లో తమకు తేలికగా స్థానం దొరకదని అర్ధం అయ్యే వరకు పాకులాడు తారు. అన్ని వ్యవస్థలతో పాటు హక్కుల వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసం అయి ఉంది. మానవ హక్కుల సంస్థల అధిపతులుగా హక్కుల వ్యతిరేకులను, సనాతన ధర్మాన్నీ, సామాజిక అసమానతలు సమర్ధించే వాళ్లనీ నియమిస్తున్నారు. ప్రజలకి తమ గోడు చెప్పుకున్నా పట్టించుకునే వ్యవస్థలు లేవు. దీన్ని మళ్ళీ నిర్మించాలంటే ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద కానీ, ఇంకా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ మీద కూడా, అంతగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే గత కొన్నేండ్లుగా వహించిన మౌనాన్ని వదిలి మళ్ళీ తమ భవిష్యత్తుని కాపాడుకునే పనిలో పడాలి.
సంఘటితమై పోరాడాలి
ఇక్కడ మనకి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇదివరకు హక్కుల ఉల్లంఘన జరిగితే మనం న్యాయ వ్యవస్థ ద్వారా రాజ్యం మనని కాపాడుతుంది అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు రాజ్యం అన్ని రంగాల నుంచి చేతులు దులుపుకుని బైట పడినట్టే న్యాయం చేయాల్సిన బాధ్యత నుంచి కూడా బైట పడింది. ఆర్ధిక, సామాజిక అసమానతలనే కాదు అన్యాయాలను కూడా అశీఅ-ర్a్వ aష్శీతీరకి వదిలేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలే సంఘటితమై ఒకరిని ఒకరు కాపాడుకోవాలి. పల్లెల్లో ఉన్నప్పట్టి సామూహిక స్ఫూర్తిని పునరుద్ధరించుకుని పరస్పర సహకారంతో బతికే మార్గాలు వెతుక్కోవాలి. ఇది ఎవరి పరిధిలో వాళ్ళం మన సమర్ధతను బట్టి నిత్యం ఆచరించాల్సిన విధి. సమాజంలో సుస్థిర మార్పు రావాలంటే దాన్ని వ్యక్తి స్థాయి నుంచే నిర్మించుకోవాలి.
ప్రొ|| పద్మజా షా