ప్రతి బిడ్డకు తొలి సామాజిక ఒడి బడే. ఇంటి నుండి బడిలోకి వెళ్లిన ఆ బిడ్డకు ఇంట్లోని అమ్మానాన్నలు అక్కతమ్ములు, అన్నాచెల్లెలు, అవ్వాతాతలు, ఇరుగు పొరుగు వారితో పాటు ఇప్పుడు బడిలో కొత్త కొత్త స్నేహితులు, టీచర్లు పరిచయం అవుతారు. వారు చూపించే ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చదువుతో పాటు మున్నుందు జీవితానికి అవసరమయ్యే బలమైన బాల్య పటిష్ట పునాదులు అవుతాయి. ఒక్కోసారి అవే జీవితాన్ని హాయిగా ముందుకు నడిపించే మధురస్మృతులు కూడా కావచ్చు. ఇదో అనుభవ సత్యం.
గరిపెల్లి అశోక్ ‘గోటీలాట’ పిల్లల కథల పుస్తకం తిరగేస్తే ప్రతి పుటలో అవే బాల్యస్మృతులు తారట్లాడతాయి. ప్రతిదీ చదువే కదా.. చదువు కాని చదువు తరగతి గదిలోనూ, బయటా (బియాండ్ ద క్లాస్ రూమ్) అంతర్లీనంగా ఎంతగా నిబిడీకృతమై వుంటుందో అర్థమవుతుంది. దాన్ని ఒడుపుగా ఒడిసిపట్టుకుని పిల్లలకు అందించడంలోనూ టీచర్‌లోని మానవీయ స్పర్శ, నైపుణ్యం మనకు గోచరిస్తుంది. ఎంతైనా టీచర్ కూడా మనిషే కదా! ఇప్పుడున్న మార్కెట్ అమానవీయ ప్రపంచంలో టీచర్ పరాయీకరణ చెంది యంత్రంగా మారుతున్నాడు. తనదైన వృత్తికి, ప్రవృత్తికి దూరమైపోతున్నాడు. పిల్లలు ఆగం అయిపోతున్నారు. పిల్లలకు దక్కవలసిన ప్రేమానురాగాలు, అందమైన ముచ్చట్లు ఇటు ఇంట్లోనూ, అటు బయట అందక బాల్యాన్ని కోల్పోతున్నారు.
పదకొండు కథలున్న ఈ చిరుపుస్తకంలోని ఏ కథను పట్టుకున్నా మనం కూడా బాల్యంలోకి పోయి ఇది కదా చదువు..? అని ఒక్క క్షణం నిబిడాశ్చర్యానికి లోనౌతాము.
‘బిస్కట్లు’ కథలో వలస పిల్లాడు రామలాల్ గురించి తోటిపిల్లలు చూపిన కరుణామృతాన్ని గ్రహిస్తే, ‘మక్కకంకులు’ కథలో మీసాలసార్, లచ్మన్ సార్‌లు పిల్లలతో ఆడుకునే గారాల ముచ్చట్లు గమనిస్తాం.
గరిపెల్లి అశోక్ గత కొన్నేళ్లుగా పిల్లలతో దీక్షగా పనిచేస్తూ, కథలు రాయిస్తూ, చదువుతూ, ఆ విశేషానుభవాన్ని రంగరించి సూక్ష్మంలో మోక్షంలా వివరించినట్టున్నాయి ఈ కథలు. పిల్లల కథలు రాసేవారికి ఒక పాఠంలా ఉపకరిస్తాయనడంలో కూడా అతిశయోక్తి లేదు.
పెద్దింటి అశోక్ కుమార్, పైడిమర్రి గిరిజ, పాతూరి మహేందర్ రెడ్డి రాసిన ముందుమాటలు కూడా వారి బాల్య స్మృతులతో కలిసి సుభోదకంగా సాగుతాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీముని మల్లారెడ్డిపేట సుబోధిని గ్రామ గ్రంథాలయం వారు ప్రచురించిన ఈ పుస్తకం ఇటీవలే బాలసాహిత్య పరిశోధకులు శ్రీ వి.ఆర్.శర్మ – పద్మావతి దంపతులకు నాలుగున్నర దశాబ్దాల మైత్రికి చిహ్నంగా గరిపెల్లి అశోక్, సరోజని ఈ చిరుపుస్తకాన్ని అంకితమివ్వడం మరింత విశేషం.
– శాంతారావు