హోంగార్డుల వేతనాల పెంపు ఘనత కేసీఆర్‌దే

– రూ.79 పెంచి రూ.1000 అని చెబుతారా ?:
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
హోంగార్డులకు వేతనాల పెంపు ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధినేత కేసీఆర్‌దేనని మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. హోం గార్డుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన విచిత్రం గా ఉందన్నారు. ఏదో ఉద్దరిస్త్తారని అనుకున్నామనీ, వాళ్ళ జీవితాల్లో వెలుగు లు నింపుతారని భావించామని చెప్పారు. కానీ జరగలేదన్నారు. రూ. 79 మాత్రమే పెంచి రూ. 1000 పెంచినట్టు చెప్పడం సరికాదన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నప్పుడే హోంగార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించిందన్నారు. మేము అధికారంలో వచ్చినప్పుడు రూ.9000 జీతం ఉండేదనీ, కేసీఆర్‌ ప్రతియేటా రూ. 1000 పెరిగేలా ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పట్లోనే రూ.20 వేల జీతం పెంచామన్నారు. తరువాత వారికి పీఆర్సీ 30 శాతం సైతం ఇవ్వడం జరిగి ందన్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ డ్యూటీ,అన్ని విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పొలీస్‌ స్టేషన్‌లలో పని చేసే వారికి 30 శాతం రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వడం జరిగింద న్నారు. పోలీస్‌లతో సమానంగా డ్రెస్‌ అలవెన్స్‌ కూడా ఇచ్చామని వివరిం చారు. ప్రత్యేక సెలవులు సైతం మంజూరు చేసి నట్టు చెప్పారు. వారిని రెగ్యులరైజ్‌ చేయాలని రాజీవ్‌ త్రివేది నేతృత్వంలో కమిటీ వేసిన విషయం అందరికీ తెలుసన్నారు. పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తు చేశారు. చనిపోయిన వారికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇస్తారని అనుకున్నామన్నారు. హోంగార్డు లను స్పెషల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌లుగా పర్మినెంట్‌ చేయాలని కోరారు. చనిపోయిన హోంగార్డులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రిటైరైన హోంగార్డులకు కూడా బెనిఫిట్లు అమలు చేయాలని కోరారు. పోలీసుల తరహాలోనే హోంగార్డులకు కూడా ప్రయోజనాలు కల్పించాలని, కొత్తగా హోంగార్డుల నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు.