– వైసిపి అధినేత వైఎస్ జగన్
అమరావతి : తల్లికి వందనం పథకంలో, వారికి ఇస్తానన్న రూ.15 వేలు ఎప్పుడు ఇస్తారనే అంశం ప్రస్తావించకుండా మెగా పేరెంట్, టీచర్స్ మీట్ అంటూ సిఎం చంద్రబాబు హడావుడి చేస్తున్నారని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు కొత్తమీ కాదని, ఈ సమావేశాలకు పేరు మార్చి కూటమి ప్రభుత్వం హడావుడి చేయడం తప్ప మరేమీ లేదంటూ ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. వైసిపి ప్రభుత్వం ఎంతో కష్టించి విద్యా రంగాన్ని తీర్చిదిద్దితే… కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ తల్లికి వందనం అంటూ తల్లిదండ్రులకు సున్నం రాసిందన్నారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో రూ.12,450 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.
తల్లిదండ్రులపై ఈ భారం పడదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ హయాంలో విద్యార్థులకు కల్పించిన వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం రద్దు చేసి వారికి అన్యాయం చేస్తోందన్నారు.