ఆశాలపై లాఠీచార్జిని ఖండిస్తున్నాం : ఎన్వీ సుభాష్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని తమ పార్టీ ఖండిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమలు చేయాలని డిమాండ్‌ చేస్తే దాడులు చేయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూనే మరో పక్కన మహిళలపై దౌర్జన్యానికి ఒడిగట్టడం దారుణమని పేర్కొన్నారు. ఆశావర్కర్ల (మహిళలు)పై పోలీసులు చేయిచేసుకోవడమే కాకుండా.. అసభ్యకర పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.