మార్చాల్సింది తెలంగాణా బతుకుల్ని

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా జరుగుతున్న టాపిక్‌ ఇది. ప్రజా సమస్యలపై కాకుండా వాటి దృష్టి మరల్చేందుకు గాను అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న చర్చగా దీని అభివర్ణనలు కూడా మొదలయ్యాయి. సహజంగానే ఏదైనా అంశం ముందుకొచ్చినప్పుడు రాజకీయాల్లో ఇలాంటి అభిప్రాయాలు, ఆలోచనలు వస్తుంటాయి. తాజాగా ”తెలంగాణ తల్లి” విషయానికోస్తే తెలంగాణ తల్లి ఎలా ఉండాలి? అనేది ప్రజల్లో కంటే రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న రాద్దాంతం ఆసక్తి కలిగించే చర్చగా నడుస్తున్నది. నాడు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండాలని అప్పుడు నాటి టీ(బీ)ఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రామగ్రామానా తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరణలు జరిగాయి. ఆ విగ్రహం విషయంలో కూడా అనేక విమర్శలు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సెంటిమెంట్‌ ముందు ఆ విమర్శలు ఎవ్వరూ లెక్కచేయలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర నిర్వహించి, నిజాం దొరలకు ముచ్చెమటలు పట్టించిన వీరనారి ఐలమ్మను తెలంగాణ తల్లిగా గుర్తించాలని సామాజిక సంఘాలు డిమాండ్‌ చేసినప్పటికీ దశాబ్దపాలనలో ఐలమ్మను తెలంగాణ తల్లిగా ఒప్పుకోవడానికి సాహసించలేదు. ఎందుకంటే ఐలమ్మకు ధగధగా మెరుపులతో కూడిన పట్టుచీరలు లేవు. మెడలో వేసుకోవడానికి హారాలు అసలే లేవు. పాత సంతుకలో ఉండే చేనేత చీర, మెడలో పసుపు తాడు, కాళ్లకు కడియాలు, నుదుట కుంకుమ బొట్టు తప్పితే ఆమెకు ఏమీ లేవు.అందుకే ఆమెను తెలంగాణ తల్లిగా ఒప్పు కోలేదనే విమర్శలు జోరుగా నడిచాయి.
అయితే ఇప్పుడీ చర్చ ఎందుకొచ్చిందంటే? 2023 డిసెంబరులో మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. గత కేసీఆర్‌ పాలనలో అమలు చేసిన టీఎస్‌ను టీజీగా, టీఎస్‌ఆర్టీసీని టీజీఎస్‌ఆర్టీసీగా, టీఎస్‌పీఎస్‌సిని టీజీపీఎస్‌సీగా మార్చారు. యాదాద్రిని యాదగిరిగుట్టగానే పిలవాలని సూచించారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాంలోనూ మార్పులు చేర్పులు చేశారు. బంగారపు అంచుతో ఉండే ఆకుపచ్చ చీర, ఒక చేతిలో వరికంకులు, మెడలో హారం, పోరాటానికి ప్రతిరూపంగా గద్దెపై పిడికిళ్లను చేర్చారు. ఈ విగ్రహాన్ని ఈనెల 9న సచివాలయంలో ఆవిష్కరించారు.అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏమిటంటే? నిజమైన తెలంగాణ తల్లి ఎలా ఉండాలనేది ఎవ్వరూ పూర్తిగా చెప్పలేరు. ఇలా ఉండాలనే క్లారిటి కూడా ఇవ్వలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయి గ్రామీణ సాంప్రదాయ సంస్కృతి కలిగిన రాష్ట్రం. సబ్బండ వర్గాల వేదిక. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ మహిళ ఎలా ఉంటుందో గ్రామీణ ప్రాంతాలపై అవగాహన కలిగిన ప్రతి వ్యక్తికి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలోని నూటికి తొంభై శాతం మహిళలు అధునాతన సౌందర్య అలం కరణపై కాకుండా సాంప్రదాయ అలంకరణకే ప్రాధాన్యత ఇస్తారు. మనం కూడా మన తల్లి ఎలా ఉండాలని అనుకుంటాము? మన తల్లి రూపం అచ్చమైన గ్రామీణ సాంప్రదాయ రూపం కొట్టొచ్చినట్లు ఉండాలనేది మనందరి ఆకాంక్ష. పార్టీల మధ్య వైరుధ్యాలు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాన్ని కనుమరుగు చేయకుండా ఉంటే అదే చాలు..! నాడు కేసీఆర్‌ పాలనలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహరూపం నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చి వేసింది. రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తే వారికున్న ఆకాంక్షలు, ఆలోచనలకు తగినట్లుగా ఉండాలని మరో రూపం తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫలానా విగ్రహం ఇలా అలా ఉండాలనేది పాలకుల ఇష్టమా.. ప్రజల అభిష్టమా ముందుగా తేలాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల బతుకులు మారాలి.విగ్రహ రూపాలు కాదు.
– కల్కూరి ఎల్లయ్య, 8179190156