ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం

Tiger migration in Mulugu district– అటవీశాఖ అధికారుల నిర్ధారణ
నవతెలంగాణ/వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బొదాపురం పంచాయతీ పరిధిలో పులి సంచారం కలకలం రేపింది. దాని పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు పెద్దపులి సంచరించినట్టు నిర్ధారించారు. పాద ముద్రల ఆధారంగా పులి గోదావరి నుంచి మంగపేట వైపునకు వెళ్లినట్టు తేల్చారు. వెంకటాపురం రేంజర్‌ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సమయంలో సమీపంలోని గోదావరి లంకలో నుంచి కొందరు రైతులు లంకలోని మిర్చి తోట వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పెద్దపులి గాండ్రిపు వినిపించింది. గమనించిన రైతు అటువైపు టార్చిలైట్‌ వెలుగు చూపడంతో పులి గోదావరి నది వైపునకు వెళ్ళింది. ఆ గాండ్రిపులు గ్రామస్తులకూ వినిపించాయి. భయాందోళనకు గురైన రైతులు, గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం పులిసంచరించిన ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. అవి పెద్దపులికి చెందిన పాదముద్రలుగా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి ఉంటుందని గుర్తించారు. గోదావరి నదిలో అడుగుల ఆధారంగా మంగపేట మండలం వైపునకు వెళ్లి ఉంటుందని తేల్చారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలం పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు, గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. అడవిలోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. పెద్దపులి వేటకై ఉచ్చులు, నీటిలో విష పదార్థాలు వంటివి ఏర్పాటు చేయొద్దని తెలిపారు. పులి సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలపాలని కోరారు.