– ప్రజాభవన్‌లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల ఏఎన్‌ఎమ్‌ల ఆందోళన
– 20 రోజుల్లో చెల్లిస్తామని హామీనిచ్చిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న తమకు 11 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏఎన్‌ఎమ్‌లు ఆందోళనకు దిగారు. వారి వద్దకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ప్రజాపాలన నోడల్ అధికారి దివ్య దేవరాజన్ చేరుకుని వినతిపత్రం తీసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20 రోజుల్లో వేతనాలు చెల్లించేలా కృషిచేస్తానని డాక్టర్ జి.చిన్నారెడ్డి హామీనిచ్చారు. 11 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఈ సందర్భంగా ఏఎన్‌ఎమ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. హామీ మేరకు వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖకు వెళ్లి అక్కడ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె. బ్రహ్మచారి మాట్లాడుతూ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ ఉన్న ఏఎన్‌ఎంల వేతనాల చెక్కును వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తగదన్నారు. ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు చెల్లించాలనీ, వారాంతపు సెలవును అమలు చేయాలని కోరారు. పీఎఫ్ ఈఎస్‌ఐ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్‌ఎంలు సంఘటితంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఎ.కిరణ్, ములుగు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్. రాజేందర్, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు స్వరూప, రాజమణి, పల్లవి, జంగుబారు, రమ, శ్రీదేవి, జయశ్రీ, మీనాక్షి, మహేశ్వరి, నర్మద తదితరులు పాల్గొన్నారు.