– మినీ ఇండియాగా పేరొందిన హైదరాబాద్ ప్రతిష్టను పెంచుతాం : సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహ పున:ప్రతిష్టలో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/బేగంపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని మతాల ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ గంగా జమున సంస్కృతి మరింత పరిఢవిల్లేలా పాలన చేపడుతున్నదని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతుల సమ్మేళనంతో మినీ ఇండియాగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగర ప్రతిష్టను తమ ప్రభుత్వం మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. బుధవారం సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. దేవాలయ నిర్వాహకులు ఆలయ లాంఛనాలతో మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రి సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాలు, మనోభావాలను గౌరవిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహం స్థానంలోనే 250 కిలోల పంచలోహాలతో కూడిన విగ్రహాన్ని ప్రతిష్టించిందని చెప్పారు. దేవాలయంలో కూడా ఆధునీకరణ పనులు చేపట్టినట్టు తెలిపారు. స్థానిక ప్రజలు, భక్తులు ఎంతో సంయమనంతో వ్యవహరించి విగ్రహ పున:ప్రతిష్టకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటనకు కారకులైన వ్యక్తులకు కఠిన శిక్షులు పడేలా చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసం కొంతమంది విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..గతంలో ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. దేవాలయాలను అందరూ కాపాడుకోవాలనీ, విద్రోహ చర్యలు జరిగినప్పుడు ప్రజలంతా కలిసి ఎదుర్కోవాలి తప్ప రాజకీయాలు చేయడం తగదని చెప్పారు. ప్రజల విశ్వాసాలను కాపాడేలా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి, కార్పొరేటర్ దీపిక, నార్త్‌జోన్ డీసీపీ సాధన రష్మిపెరుమాల్, సనత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కోట నీలిమ, మాజీ కార్పొరేటర్ రూపహరికృష్ణ, తదితరు పాల్గొన్నారు.