పెరిగిన మానవ అక్రమ రవాణా

Increased human trafficking
Illustration: Ratna Sagar Shrestha/THT

– ప్రధాన బాధితులు బాలికలు, మహిళలే : యూఎన్‌ నివేదిక వెల్లడి
వియన్నా : అంతర్జాతీయంగా మానవుల అక్రమ రవాణా పెరిగిందని ఐక్యరాజ్య సమితి సంస్థ యుఎన్‌ఓడిసి పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఒక నివేదికను వెలువరించింది. 2019లో కరోనా ముందు నాటి స్థాయితో పోల్చితే 2022లో ఈ అక్రమ రవాణా బాధితుల సంఖ్య 25శాతం మేరా పెరిగిందని పేర్కొంది. వ్యక్తుల అక్రమ రవాణాపై 2024 గ్లోబల్‌ రిపోర్ట్‌ను మాదకద్రవ్యాలు, నేరాలపై ఐక్యరాజ్య సమితి కార్యాలయం (యుఎన్‌ఓడిసి) ప్రచురించింది. ఇందుకు దారిద్య్రం, ఘర్షణలు, వాతావరణ విపత్తులు వంటి అంశాలను కారణాలుగా చూపింది. వీటివల్ల ప్రజలు దోపిడీకి గురి కావడానికి అవకాశాలు పెరిగాయని పేర్కొంది. బాలల రవాణా, బలవంతంగా కార్మికులను తరలించడం, అలాగే బలవంతంగా నేరాలు చేయించడం వంటి అంశాలు కూడా ఇదే కాలంలో పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా చూసినట్లైతే వెట్టి చాకిరి కోసం తరలించే బాధితుల సంఖ్య 2019తో పోలిస్తే 2022లో 47 శాతం పెరిగింది. బాలల బాధితుల సంఖ్య 31 శాతం పెరిగింది. ఇక బాలికల అక్రమ రవాణా 38 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. 156 దేశాలకు చెందిన డేటాను ఈ నివేదిక విశ్లేషించింది. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఈ అక్రమ రవాణా బాధితుల్లో మహిళలు, బాలికలు 61 శాతం వున్నారని వెల్లడించింది. వీరిలో 60శాతం మంది బాలికలను లైంగిక దోపిడీ కోసమే బలవంతంగా తరలించారని పేర్కొంది. ఆన్‌లైన్‌ కుంభకోణాలతో సహా బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేయడం కూడా బాగా పెరిగిందని పేర్కొంది. 2016లో ఇటువంటి నేరాల సంఖ్య కేవలం ఒక్క శాతమే వుండేందని 2022నాటికి 8శాతానికి పెరిగిందని నివేదిక తెలిపింది. ఇందుకు పాల్పడేవారిని జవాబుదారీగా చేయడానికి బలోపేతమైన క్రిమినల్‌ జస్టిస్‌ చర్యలు తీసుకోవాల్సి వుందని యుఎన్‌ఒడిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఘడా వాలీ పిలుపిచ్చారు. బాధితులను కాపాడేందుకు, దీన్నుండి బయటపడిన వారికి సాయమందించేందుకు దేశాల మధ్య సహకారం కూడా పెరిగాల్సి వుందన్నారు.