ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు నిరసన..

Farmers protest to buy grain– సమస్యను పరిష్కరించాలని మండల అధికారులకు ఎమ్మెల్యే జారే ఆదేశం..
– కోనుగోలు చేస్తాం అని తహశీల్దార్  క్రిష్ణ ప్రసాద్ హామీ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నారాయణపురం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రంలో పట్టా భూమి కలిగిన  రైతులు పండించిన  వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో ఆసుపాక రెవిన్యూ గ్రామానికి చెందిన రైతులు పలువురు వినాయక పురం వేలేరుపాడు రహదారి లో నారాయణపురం సమీపంలో గురువారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 80 శాతం రైతులకు భూములు ఉన్నా 1/70 యాక్ట్  కారణంగా పట్టా పొందలేక పోయామని,దీంతో ఈ కారణం చేత మేము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మా పరిస్థితి ఏంటని ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు.ఏటువంటి షరతులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంటనే స్పందించి సంబంధించిన అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు.మండల వ్యవసాయ అధికారి శివరాం రాం ప్రసాద్ విధినిర్వహణలో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ఉండటంతో తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ నారాయణపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.వ్యవసాయ శాఖ స్థానిక అధికారులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఆయన పట్టా పాస్ పుస్తకాలు లేకపోయినా రైతులు ఆందోళన పడవద్దని ఆధార్ కార్డు,వ్యవసాయ భూమికి సంబంధించిన ఏదో ఒక  ఆధారం ఉన్న వరి ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జక్కుల రాంబాబు, రాయగిరి మల్లేశ్వరరావు,చందా లక్ష్మీ నరసయ్య, మిండ పెద్ద దుర్గారావు బల్లెం గంగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.