సిరియాలో అనిశ్చితి!

 Sampadakiyamడిసెంబరు ఎనిమిదో తేదీన అధ్యక్షుడు అసాద్‌ పదవి నుంచి తప్పుకొని రష్యాలో ఆశ్రయం పొందటం, టర్కీ మద్దతు ఉన్న హయత్‌ తహ్రరిర్‌ అల్‌ షామ్‌(హెచ్‌టిఎస్‌) సాయుధ బృందం అధికారాన్ని చేపట్టడంతో దశాబ్దాలుగా అంతర్యుద్ధంలో ఉన్న సిరియాలో మరో అధ్యాయం మొదలైంది.ఇప్పటికే చింపిన విస్తరిలా తలా ఒక ప్రాంతాన్ని అదుపులో ఉంచుకున్న శక్తుల పాత్ర ఏమిటో స్పష్టంగాక ముందే ఇజ్రాయిల్‌ మరోసారి దాడులకు తెగబడింది. అక్కడ అసలేం జరుగు తోందో వివరాలు బయటి ప్రపంచానికి తెలియటం లేదు. రకరకాల వ్యాఖ్యానాలు, వార్తలు వెలువడుతూ గందరగోళంలోకి నెడుతు న్నాయి. పొంతన లేని ఈ సమాచారంలో ఏది నిజమో, ఏది కాదో వెంటనే నిర్ధారించటం కష్టం. కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని నాలుగు రోజులు గడిచిన తరువాత కూడా ఏ దేశమూ గుర్తించ లేదు. పశ్చిమా సియా, మధ్య ప్రాచ్యంలో భాగమైన సిరియాతో సరిహద్దులు కలిగి ఉన్న టర్కీ, ఆర్మీనియా, ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలలో కర్దులు అనే తెగ నివసించే ప్రాంతాలతో కలిపి మధ్యలో కర్దిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్నది అమెరికా దీర్ఘకాలిక ఎత్తుగడ. దాన్ని కేంద్రంగా చేసుకొని ఆ ప్రాంతం మీద పూర్తి అదుపు కలిగి ఉండాలని చూస్తున్నది. కర్దుల ప్రాంతాలలో కొన్ని న్యాయమైన సమస్యలున్న మాట నిజం. వాటికి స్వయంపాలిత ప్రాంతాల ఏర్పాటుతో సహా ఆయా దేశాల పరిధిలో పరిష్కారం చూడాలన్నది ఒక అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక దేశ ఏర్పాటు కాకూడదని ఆయా దేశాలు, ఏది ఏమైనా తమకు ఒక మాతృభూమి ఉండాలని కర్దులు దశాబ్దాల తరబడి సాయుధ పోరాటం చేస్తున్నారు, అణచివేతకు గురవుతున్నారు.
సిరియాలో తన పథకాన్ని అమలుచేసేందుకు కర్దులతో పాటు ఐఎస్‌, ఆల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలను అమెరికా ప్రోత్సహిస్తున్నది, వందల కోట్ల డాలర్లు, ఆయుధాలను కుమ్మరిస్తున్నది. ఆక్రమంలోనే సిరియాలో చమురు, గ్యాస్‌ నిల్వలు, పంటలు పండే ప్రాంతాలను ఫ్రీ సిరియన్‌ ఆర్మీ సాయుధుల పేరుతో అమెరికా ఆక్రమించటమే గాక అక్కడ మిలిటరీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన హెటిఎస్‌ సాయుధులు టర్కీ మద్దతుతో ఎప్పటి నుంచో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. మరోవైపు గోలన్‌ గుట్టల ప్రాంతాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించుకుంది. ఇటీవలి వరకు అధికారంలో ఉన్న అసద్‌ ప్రభుత్వ మిలిటరీ, మద్దతు ఇచ్చే సాయుధ బృందాల ఆధీనంలో రాజధాని డెమాస్కస్‌, తదితర ప్రాంతాలు ఉన్నాయి. అసద్‌కు రష్యా, ఇరాన్‌ దేశాలతో పాటు హిజబుల్లా సాయుధ సంస్థ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. హెచ్‌టిఎస్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది, దాని నేత జొలానీని గతంలో అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అతను గతంలో ఆల్‌ఖైదాలో ఉన్నమాట ఎంత నిజమో తరువాత దానితో విబేధించింది కూడా అంతే నిజం. అనేక ఛాందసవాద బృందాలను అంతమొందించినట్లు కూడా చెబుతారు. అమెరికా మద్దతు ఉన్న కర్దు తిరుగుబాటుదార్లు, ఐఎస్‌ తీవ్రవాదులను టర్కీ వ్యతిరేకిస్తున్నది. సిరియాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన తప్ప ఇంకా అది కుదురుకోలేదు. ఇప్పటి వరకు అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఏకైక అజెండాతో పని చేసిన సంస్థలు ఇప్పుడు అధికారం కోసం కుమ్ములాడు కుంటాయా? పాలన సజావుగా సాగేందుకు అవకాశమిస్తాయా అన్నది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. లిబియాలో తమను వ్యతిరేకించిన గడాఫీ సర్కార్‌ను కూలదోసేందుకు నాటో కూటమి అనేక సంస్థలను ప్రోత్సహించింది. ఇప్పుడవి తమలో తాము కుమ్ములాడు కుంటున్నాయి. సిరియాలో కూడా అదే జరుగుతుందా ?
అసద్‌ రాజీనామా చేసి ప్రవాసం వెళ్లటం వెనుక ఒక అవగాహన ఉందంటూ కొందరు చెబుతున్నారు. ఆ కారణంగానే మిలిటరీ ఎలాంటి ప్రతిఘటన లేకుండా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకొనేందుకు వీలు కల్పించిందని అంటున్నారు. తాము మద్దతిస్తున్న సాయుధ సంస్థలకు సిరియాను స్వాధీనం చేసుకొనే సత్తాలేనందున అమెరికా కూడా చూసీచూడనట్లు ఉందనేది మరొక అభిప్రాయం. అయితే అదే వాస్తవమైతే తాజాగా సిరియా మీద వందలాది వైమానిక దాడులు జరుపుతున్న ఇజ్రాయిల్‌ చర్య వెనుక అమెరికా హస్తం లేకుండా ఉంటుందా? సిరియాలో విజయం సాధించింది టర్కీ అని, రానున్న రోజుల్లో దాని పలుకుబడి అక్కడ కొనసాగుతుందంటు న్నారు. ఈ పరిణామాన్ని అమెరికా అంగీకరిస్తుందా ? టర్కీతో రష్యాకు కొన్ని సమస్యలున్నప్పటికీ అమెరికా ఆంక్షలను ధిక్కరించి ఎస్‌ 400 క్షిపణి రక్షణ వ్యవస్థలను టర్కీ కొనుగోలు చేసింది.ఇప్పటి వరకు సిరియా ద్వారా హిజబుల్లా మిలిటెంట్లకు ఇరాన్‌ అందిస్తున్న ఆయుధసాయం కొనసాగుతుందా? వీటన్నింటినీ చూసినపుడు రానున్న రోజుల్లో సిరియాలో ఏం జరగనుందన్నది పెద్ద ప్రశ్న.