‘నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికీ నా కతజ్ఞతలు. గ్లోబల్‌గా ఉన్న సినీ ప్రేమికులందరూ ఇండియా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ’ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప2 : ది రూల్’ చిత్రం ఈనెల 5వ తేదీ విడుదలైంది. కేవలం 6 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి, దేశ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ‘థ్యాంక్యూ ఇండియా’ని ఢిల్లీలో మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాను మరింత ప్రేమతో, అత్యధిక వసూళ్లతో ఆదరిస్తున్న హిందీ సినీ ప్రేక్షకులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌దే. ఆయన విజన్, ఆయన కష్టానికి ప్రతిఫలం ఈ చిత్రం. ఈ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేయడం, భవిష్యత్‌లో మరింత వసూళ్లు సాధించడం ఒక ఎత్తయితే, నెంబర్స్ అనేవి వాళ్ల ప్రేమకు నిదర్శనం. అయితే ఈ నెంబర్స్ టెంపరరీ. ఎందుకంటే భవిష్యత్‌లో మరో సూపర్‌హిట్ సినిమా ఈ నెంబర్స్‌ను క్రాస్ చేస్తుంది. కానీ ఆడియన్స్ ఇచ్చే లవ్ మాత్రం శాశ్వతం. వాళ్లు నా పై చూపిస్తున్న వైల్డ్ ప్రేమకు జీవితాంతం బుణపడి ఉంటాను’ అన్నారు.