– తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
వాతావరణం మార్పులకనుగుణంగా పంటలకు సోకే చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డి శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ప్లాంట్ పాథాలజీ అండ్ ఇన్నోవేటివ్ అప్రో చెస్ ఇన్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్’ అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఫైటో పాథలాజికల్ సొసైటీ, దక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ ఫాథాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేథ, మిషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను సస్యరక్షణలో వినియోగించుకోవాలని సూచించారు. ఆహార, పోషణ, భద్రత కల్పించడంలోనూ వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేయాలన్నారు. ప్లాంట్ పాథాలజిస్ట్లే మొక్కల డాక్టర్లని కొనియాడారు.
కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. పంటకోత అనంతర నష్టాలను తగ్గించడంపై ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్తలు దృష్టి నిలపాలని సూచించారు. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ప్రస్తుత అవసరమని చెప్పారు. పర్యావరణ సమతుల్యతలు పాటించాలన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గోపాల్, గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి ప్రసంగించారు. ఈ రెండు రోజుల సదస్సు ముఖ్య ఉద్దేశాలను, చేపట్టనున్న ప్రధాన చర్చల గురించిన నివేదికను ఇండియన్ ఫైటో ప్లాంట్ ఫాథాలాజికల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్ వివరించారు. డాక్టర్ జి.రాజేష్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది ప్లాంట్ పాథాలజీ విభాగం శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.