వానరులనుండి మానవులుగా మారే క్రమంలో నిటారుగా నిలబడడం ఒక ముఖ్య ఘట్టం. అలా నిలబడడం జరిగాకనే తమ ముందరి కాళ్లు చేతులుగా మారాయన్న సంగతి మరువరాదు. దాని వెనుక ఎన్నోఏండ్ల శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఏ అతీతశక్తి వల్లనో, దేవుడి దయ వల్లనో మానవులుగా అవతరించలేదన్నది డార్విన్ చెప్పిన సూత్రం. దాన్నే స్టీఫెన్ హాకింగ్ లాంటి అపర మేధావులు కూడా. ఎ.ఐ వల్ల కూడా కాదని ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఆ ఎ.ఐ నే కాదు దేవుడిని సృష్టించింది కూడా మనిషేనని మరువరాదు. ఇప్పుడు ఆ దేవుడిని ఎ.ఐని కూడా సమృద్ధిగా వాడుకుంటే కాని కాలం గడవని కాలం.
‘ఆయన ఎత్తిన తల దించడండి, ముక్కుసూటిగా పోతాడండి, ఆయన వ్యక్తిత్వం నిటారుగా ఉంటుందండి’ అన్న మాటలు దండిగా వింటూ ఉంటాం. ఇదంతా కూడా నిటారుగా నిలబడ్డం వచ్చాకనే వచ్చాయన్నది మరచిపోకూడదు. ఇప్పుడంటే మెటోలూ, మెట్రో లైనర్లు, ఎక్స్‌ప్రెస్సులు, ఓలాలు, ఊబర్లు వచ్చాయి కాని రోడ్డు రవాణా సంస్థ బస్సులు, సెట్విన్ బస్సులు మాత్రమే ఉన్నకాలంలో మనం నిటారు గా నిలబడితేనే మనక్కాస్త స్థలం దొరికేది. పక్క స్టాపులోనో అలాంటివి ఇంకా రెండో మూడో పోయినా కనో చిక్కే అవకాశమున్న సీటు పట్టుకోవడా నికి వంగి రెడీగా ఉండేవాళ్లు తప్ప నిలబడ్డ వాళ్లందరూ నిటారుగా నిలబడాల్సిందే. లేకపోతే పడిపోవడమో, పడిపోవడానికి స్థలం లేకపోతే పక్కనున్న ప్యాసెంజర్లతో తిట్లు తినడం జరుగుతుంది. అలా నిటారుగా నిలబడడానికి కారణం మన వెన్నెముక. అసలు మనిషి వెన్నెముకే మిగతా జంతువుల వెన్నెముకలతో పోలిస్తే చాలా బలహీనమైనదని చెబుతారు. అలాంటి వెన్నెముక గల మనుషులు నిటారుగా నడవగలిగారంటే గొప్ప విషయమే మరి. జీవితం లోని చాలా సందర్భాల్లో అలా నిటారుగా నిలవగల టడం మరింత గొప్ప విషయం. ‘మేము ఓడిపో యినా కాని, కష్టకాలంలో ఉన్నా కాని నిటారుగా నిలబడ్డ ధైర్యం మాది’ అని ఒకాయనంటే ‘మీకంటే నిటారుగా ఉంటాం భై కుతుబ్ మీనార్ లాగా, ఈఫిల్ టవర్ లాగా’ ఉంటామని బుకాయించవచ్చు. ముందే అనుకున్నట్టు మీరే కాదు ‘మేము కూడా నిటారుగా నిలబడ్డాము’ అని ఇంకొకరంటే, ఆ… మాకన్నీ తెలుసులే మీరు బ్రిటిష్ వారికి వంగి వంగి సలాములు చేసినప్పుడు ఈ నిటారు ఎక్కడికి పోయింది అంటే మాత్రం అవతలవైపు నుండి ఉష్..గప్‌చుప్ అని మెల్లగా జారుకోవచ్చు. జారుకునే ముందు మీరు ఫలానా మోసగాళ్లను దేశమెలా దాటించారో మాకూ తెలుసు అనంటే, ఆ మాకూ తెలుసు అలాంటి మీ లిస్టు మా దగ్గర కూడా ఉంది అన్నాక ఎముక లేని నాలుక నిటారుగా నిలబడదని వీళ్లూ జారుకోవచ్చు.
కరువురోజుల్లో నా సంసారాన్ని నేను ఎలాగో లాక్కొచ్చాను అన్నాడట ఓ ప్రభుద్ధుడు. నీ సంసారాన్ని నీవు నడపడం కూడా ఓ పెద్ద విషయమా అనుకొనుంటారు అతని చుట్టూ ఉన్న వాళ్లు. నిన్నెలా కాపాడుకుంటావో నీ సంసారాన్ని కూడా అలాగే కాపాడుకోవడం మానవుల కనీస బాధ్యత. దాన్ని ఏదో గొప్పగా చేసి, గొప్పగా చెప్పి, ఇంకెంతగానో గొప్పగా అందరి ముందూ తనని తాను చిత్రించుకోవడం చూస్తే నవ్వొస్తుంటుంది ఆయా సందర్భాల్లో. ఉద్యోగం రాక ముందు నేనెంత కష్టపడ్డానో అని ఒకరు చెబితే, ఉద్యోగమొచ్చినాక తానెంత క్రమశిక్షణగా ఉన్నదీ ఇంకొకరు చెబుతారు. ఇంకొందరు తామెన్ని ఉద్యోగాలు చేసిందీ, ఎన్ని కష్టాలు పడ్డదీ కథలు కథలుగా చెబుతారు, అఫ్ కోర్స్ వినేవాళ్లుంటే ముందు చేయవలసింది చూడు, చేసింది తరువాత చెబుదువు అని వాళ్ల బాస్ అనొచ్చు. అసలు మా బాస్ ఇంకా పూర్తి కాని పనుల గురించే మాట్లాడుతాడు కాని అయిపోయిన పనుల గురించి, నేను బాగా చేసిన పనులగురించి ఒక్కమాటా అనడు అని వాపోతుంటారు. ఈ ప్రపంచం ఎప్పుడూ ముందుకే పోతుంటుంది కాని ఏ ఆదిత్య మూడొందల అరవై తొమ్మిది మాదిరిగా వెనక్కిపోదని మొదట గ్రహించాలి.
ఇక కష్ట కాలం గురించి కూడా కొన్ని మాటలు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు, అధికారానికి దూరంగా ఉన్నవాళ్లు చెప్పే మాటే ఇది. ‘ఇప్పుడు మనం కష్టకాలంలో ఉన్నాము’ అని. ఒక అర్థం కాని విషయమే మిటంటే అధికారంలో లేని విషయం బాధాకరమే కాని అది కష్టకాలమెలా అవుతుంది అని మా మిత్రుడితో మాట్లాడుతూ అనుకున్నాము. అధికారమే పరమావధిగా పనిచేసే వాళ్లు ఆ అధ్కారాన్ని కోల్పోయి తాము కష్ట కాలంలో ఉన్నామని చెబుతుంటారు. ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదరించిన ప్రజలకు తప్పకుండా మళ్లీ అధికారంలోకి వచ్చాక మేలు చేస్తామని, ప్రజలు కూడా ఆ ”మేలు” తమకు చేయాలని, అంటే తమను తిరిగి పైన కూచో బెట్టుకునే బాధ్యత తీసుకోవాలనీ చెబుతుంటారు. పాపం వాళ్లు నిజంగా ఎంత కష్టపడుతున్నారు అని కన్నీళ్లత్తుకునే జనం కూడా మన చుట్టూ ఉన్నారు. ‘నువ్వు నాకు నచ్చా లో సునీల్ లాగా, ‘అవుతారు సార్ మీరు ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు’ అన్నా అనొచ్చు.
అయినా నిజాం నవాబుపై పోరాటం చేసేటప్పుడు నిటారుగా నిలబడిందెవరు, ఆ తరువాత కూడా ప్రజాపక్షం వహించింది, వహిస్తున్నది ఎవరు అన్న విషయాలు మాత్రం అందరికీ తెలుసు. అసలు వాళ్లజెండా, అజెండా ఎప్పుడు ప్రజల వైపే నిటారుగా నిలబడుతుంది అని కూడా అందరికీ తెలుసు.
జంధ్యాల రఘుబాబు
9849753298