‘పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహం వంటిది’ అంటారు. అంత గొప్పది మరి పుస్తకం. భాదలో వున్నప్పుడు మనసు మరల్చి సంతోషాన్ని అందించే గొప్ప స్నేహ హస్తం పుస్తకం. తెలియనివి భోదించడంలో గురుస్థానాన్ని కలిగి, మనల్ని సన్మార్గంలో నడిపెంచేదే పుస్తకం. మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే… ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి శక్తిమంతమైనది పుస్తకం. ఏది ఏమైనా పుస్తకం చదవడంలో వున్న ఆనందం మరెందులోనూ వుండదు. చదివిన మనకు సంతృప్తిగా కూడా వుంటుంది.
ఎంతైనా పుస్తకం పుస్తకమే. ఎవ్వరూ లేనప్పుడు నేనున్నాను అంటూ తోడుగా ఉంటుంది. ఓ స్నేహితుతునిగా, గురువుగా ఎన్నో అవతారాలను పోషించి మనల్ని ఒకతాటిపై నడిపించే శక్తి పుస్తకానికి వుంది. అంతే కాదు పుస్తకాలు దీపాలవంటివి కూడా. వాటి వెలుతురు మనలోని మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది. నేడు మాయమైపోతున్న మానవతా విలువలను తట్టి లేపుతుంది. సానపెట్టినకొద్ది రాయి ఎలాగైతే రత్నం వలె ప్రకాశిస్తుందో… అలాగే మనం కూడా చదివినకొద్దీ వివేకవంతులమవుతాము.
అందుకే ప్రతి ఒక్కరూ పుస్తకం చదవడం ఓ అలవాటుగా మార్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంప్యూటర్లు, టీవీలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి ఎన్ని వచ్చినా ఇవేవీ పుస్తకానికి ప్రత్యామ్నామం కావు, కాజాలవు. ప్రతి ఒక్కరు వారికి ఇష్టమైన పుస్తకాలు చదవాలి. మన ఇంట్లో పుస్తకాల కోసం ప్రత్యేకంగా ఓ అల్మారా ఏర్పాటు చేసుకోవాలి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా పుస్తకాలు చదవడం వల్ల వారి వికాసానికి, పురోభివృద్ధికి ఎంతో సహకరిస్తుంది.
నిరంతర అధ్యయనం మన ఎదుగుదలకి తోడ్పడుతుంది. అందుకే పుస్తకాలు చదవడం మన నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. సినిమాలకు, షికార్లకే కాకుండా మనకు సమీపంలో పుస్తకాల పండుగలు జరుగుతుంటే కచ్చితంగా కుటుంబ సమేతంగా వెళ్లాలి. ఒక కొత్త పుస్తకాన్ని కొని చదవడంలో ఉండే ఆనందాన్ని మనం ప్రేమించే వాళ్లు అనుభవించేలా చేయాలి. ఒక్కొక్కసారి పుస్తకం మన జీవితాన్నే మార్చివేస్తుంది. అందులోని ఒక్క వాక్యం చాలు మనల్ని ఆలోచింపజేయడానికి. అంతెందుకు ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి జీవితాలను ఒక్క సారి పరిశీలించండి. వారంతా పుస్తకాలు చదివినవారే. అందుకే పుస్తకాలు చదవడం మన బతుకులో భాగం కావాలి. పుస్తకానికి మన జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
అయితే నేడు పుస్తకాలు చదివే వారి సంఖ్య రానురాను తగ్గిపోతుంది. పుస్తకమే జీవితంగా గడపాల్సిన పిల్లలు సైతం సెల్‌ఫోన్లకు అలవాటు పడ్డారు. చాలా మంది పుస్తకం అంటే పాఠ్యపుస్తకాలే అనుకుంటున్నారు. జీవితాన్ని, సమాజాన్ని చూపించే పుస్తకాలు కూడా ఉంటాయనే విషయాన్నే గుర్తించని వారు నేటికీ మన చుట్టూ ఎందరో ఉన్నారు. మన కార్పొరేట్ విద్యా విధానమే దీనికి కారణం. ర్యాంకులు, మార్కులు తప్ప పిల్లలకు మరో ప్రపంచం లేకుండా చేస్తున్నారు. పుస్తకాలు చదవడం అంటే సమయం వృధా చేసుకోవడం అనే భావాన్ని నూరి పోస్తున్నారు. సెల్‌ఫోన్ చేతిలో ఉంటే అన్నీ మనకు తెలిసినట్టే అనే భ్రమలో ఉంటున్నారు. ఇది పిల్లల భవితకు అస్సలు మంచిది కాదు. అందుకే పిల్లలకు పాఠ్యపుస్తకాలతో పాటు సామాజిక, సాహిత్య, చారిత్రక పుస్తకల పట్ల ఆసక్తి కలిగించాలి. చిన్నతనం నుండే పుస్తకాలు చదవాలనే ఆలోచన వారిలో రేకెత్తించాలి. ఇది మనం చేయగలిగితే సమాజంలోని ఎన్నో రుగ్మతలను రూపుమాపగలం. అందుకే అదిగో.. పుస్తకాల పండుగ మనల్ని రారమ్మంటూ పిలుస్తోంది.