గొప్ప వ్యక్తి

శశి 9553809850 పెట్రోల్‌ బంక్‌కి వెళ్లిన దినేష్‌ తన కార్‌ ముందు ఇంకా రెండు కార్లు ఉండడంతో, ఎదురుచూస్తూ ఒకసారి వాచీ చూసుకున్నాడు. ఇవ్వాళ ఆఫీసుకి పది నిమిషాలు ముందు వెళ్లి ఎవరెవరు ఆలస్యంగా వస్తున్నారో చూడాలనుకున్నాడు. కానీ ఇవ్వాళ కూడా రోజూలాగే ఆలస్యం అయింది. పెట్రోల్‌ కొట్టే కుర్రాడు, ఒక కార్‌కి, తర్వాత రెండు బైక్‌లకి, మళ్లీ ఒక కార్‌ కి, అలా పెట్రోల్‌ కొడుతున్నాడు.
దినేష్‌ ముందున్న రెండు కార్లలో ఒక కార్‌ పెట్రోల్‌ కొట్టించుకుని వెళ్లిపోయింది. బైక్‌కి పెట్రోల్‌ కొడుతున్నాడా కుర్రాడు. యథాలాపంగా అటు, ఇటూ చూస్తున్న దినేష్‌కి, తన కార్‌ పక్కన బైక్‌ల వరసలో ఉన్న వెంకట్‌ కనిపించాడు. పాత షర్టు ప్యాంటు, డొక్కు స్కూటరు ‘ఇతను బాగా కష్టపడి చదువుకున్నాడని, మంచి ఉద్యోగం సంపాదించాడు అని రామాపురంలో పక్క వీధిలో ఉండే ఉష వదిన చెప్పింది. ఏమయ్యిందో పాపం ఇలా ఉన్నాడు. అయినా చదివే వాళ్లు ఎక్కువైపోవటంతో, చాలా మందికి సరైన ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడుతున్నారు. దేవుడి దయ వలన నాకు మంచి కంపెనీలో మేనేజర్‌ ఉద్యోగం వచ్చింది. మంచి జీతం. కాబట్టే భార్యా పిల్లలను ఏ లోటూ లేకుండా చూసుకోగలుగుతున్నా’అని అనుకుని ఒక నిట్టూర్పు వదిలి టై సరిచేసుకుని, తన వంతు రావటంతో పెట్రోల్‌ కొట్టించుకొని, ఆఫీసు వైపుగా కార్‌ని పోనిచ్చాడు దినేష్‌.
సరిగ్గా వారం తర్వాత సూపర్‌ మార్కెట్‌లో మళ్లీ వెంకట్‌ కనిపించాడు అదే వాలకంతో. ‘మనకెందుకొచ్చిందిలే మళ్లీ ఏ ఉద్యోగం అన్నా అడిగితే ఇబ్బంది’ అనుకుని వెంకట్‌ను చూసీచూడనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు దినేష్‌.
ఇంటికి వెళ్ళిన దినేష్‌తో భార్య ప్రమీల ”ఏవండీ! చిన్నదాని పుట్టినరోజు వస్తోంది. పోయిన సంవత్సరం వంటలు చాలలేదు, కానీ చాలా రుచిగా ఉన్నాయి. అందరూ బాగున్నాయి అన్నారు. వాళ్లకే ఆర్డర్‌ చెప్పేయనా?, పెద్ద దాని పుట్టిన రోజున వంటలు మిగిలాయి కానీ, అంత రుచి అనిపించలేదు. ఏంచేద్దాం?”అని అడిగింది.
ఆ మాటలకి దినేష్‌ ”వాళ్ళకే చెప్పేరు. పోయిన సంవత్సరం వంటలు చాలలేదు అని కూడా చెప్పు. సేవింగ్స్‌ ఏమి లేవు. పోయిన నెలలో మీ ఫ్రెండ్‌ కూతురు పెళ్లి షాపింగ్‌ అని వాళ్ళతో వెళ్లి, నువ్వూ ఒక డైమండ్‌ నక్లెస్‌ కొని, క్రెడిట్‌ కార్డ్‌లో కూడా రూ.5 లక్షలు వాడావు. అవే ఈ నెలాఖరులోగా ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను. చిన్నదాని పుట్టినరోజుకు ఇంకా ఇరువై రోజులు ఉన్నాయిగా, ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాలే. అన్ని ఏర్పాట్లు బాగా జరిగేలా చూడు. లేదంటే చిన్నది బాధపడుతుంది. చుట్టాలు ఫ్రెండ్స్‌లో బాగోదు కూడా అంటాడు” ఆ మాటలకు ప్రమీల ”బాగుంది. నాకేదో నచ్చి ఒక్క నక్లెస్‌ కొనుక్కుంటే లెక్కలు చెబుతారేంటి? పుట్టినరోజు చెయ్యలేకపోతే మానేయండి. పేరుకి పెద్ద మేనేజర్‌ కానీ, చిన్న చిన్న ఖర్చులకి కూడా తెగ బాధపడిపోతారు. మా ఫ్రెండ్‌ లత వాళ్లాయనకు మీకంటే చిన్న జీతం కానీ అదెప్పుడు షాపింగ్‌కి వచ్చినా బంగారు నగలు ఏవోవకటి కొంటూనే ఉంటుంది.” అంటుంది అక్కసుగా.
దినేష్‌ ”ప్రమీ! నేను నిన్నేమీ అనటం లేదు. పరిస్థితి చెబుతున్నా అంతే. పిల్ల పుట్టినరోజు చెయ్యకపోతే, నాకు మాత్రం చిన్నతనం కాదా? నువ్వు ఆరెంజ్మెంట్స్‌ చెరు” అన్నాడు.
తర్వాత భార్యాభర్తలిద్దరూ, ఫుడ్‌ ఏమి పెట్టాలి? డెకరేషన్‌ ఎలా చేయిస్తే బాగుటుంది? ఏం గిఫ్టులు ఇవ్వాలి? చిన్నదానికి సర్‌ప్రైజ్‌గా ఏమిస్తే బాగుంటుంది? అన్నీ మాట్లాడుకున్నారు.
ఆ ఏర్పాట్లలో బిజీ అయింది ప్రమీల. ఇంటికి డెకరేషన్‌ చేయించింది. అందరినీ పిలిచింది. పిల్లలకి తనకీ, దినేష్‌కి బట్టలు కొంది. చిన్న కూతురు కోసం ఐ ఫోన్‌ కొత్త వర్షన్‌ తెచ్చి సర్‌ప్రైజ్‌గా ఇవ్వాలని దాచి పెట్టింది.
ఈ ఖర్చులన్నిటి కోసం దినేష్‌ తెలిసిన వారి దగ్గర రూ.6 లక్షలు అప్పు చేశాడు.
పుట్టిన రోజు నాడు చిన్నది ప్రణతి ఫ్రెండ్స్‌, పెద్దది లాస్య ఫ్రెండ్స్‌, దినేష్‌ ఫ్రెండ్స్‌, ప్రమీల ఫ్రెండ్స్‌ చుట్టాలు, ఇరుగుపొరుగు వాళ్లు అందరూ కలిసి దగ్గర దగ్గర 400 మంది అయ్యారు. దినేష్‌, ప్రమీల అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరికీ అన్నీ అందుతున్నాయో లేదో దగ్గరుండి చూసుకోసాగాడు.
కేక్‌ కట్‌ చేశాక దినేష్‌ ప్రమీల, ప్రణతికి ఐ ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. అది చూసి ప్రణతి గంతులేసి అమ్మానాన్నలను ముద్దులతో ముంచేసి, తన కాలేజీ ఫ్రెండ్స్‌కి చూపించి తెగ మురిసిపోయింది.
పుట్టినరోజు చాలా బాగా జరిగింది. మర్నాడు బద్ధకంగా ఆఫీస్‌కి వెళ్లిన దినేష్‌కు హెడ్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఇన్‌స్పెక్షన్‌ నిమిత్తమై ఆఫీసర్‌ మర్నాడే రాబోతున్నారని, తగిన ఏర్పాట్లు చేసుకోమని,’ కంగారు పడిన దినేష్‌ దానికి కావాల్సిన ఏర్పాట్లలో తలమునకలవుతూ ఆఫీస్‌ ఎకౌంట్‌ ఫైల్స్‌, కస్టమర్‌ డేటా అంతా కంగారుగా పరిశీలించసాగాడు. వాటిలో చాలా మటుకు తప్పులు సరిచేశాడు. ఇంకా పరిశీలించాల్సిన డేటా చాలా ఉండిపోయింది. తెల్లవారింది. కంగారు పడుతూనే హెడ్‌ ఆఫీస్‌ నుంచి వచ్చే ఆఫీసర్‌ కోసం దండ మొదలైన ఏర్పాట్లతో అరగంట ముందే ఆఫీస్‌కి వెళ్లి తన స్టాఫ్‌తో సహా బయట ఎదురు చూడసాగాడు. హెడ్‌ ఆఫీస్‌కి సంబంధించిన కారు వచ్చి ఆగింది. అందులో నుంచి హుందాగా దిగి బొకే అందుకుంటున్న వ్యక్తిని చూసి దినేష్‌ ఆశ్చర్యపోయాడు. అతను ఎవరో కాదు వెంకట్‌ దినేష్‌ ఊరివాడైన వెంకట్‌. అయితే ఇప్పుడు అతని బట్టలు మాసి లేవు శుభ్రంగా ఉతికిన మామూలు బట్టలు బ్రాండెడ్‌ బట్టలు కావు. ఒక్కసారి తన బ్రాండెడ్‌ బట్టలు వైపు చూసుకున్నాడు దినేష్‌. వెంకటేష్‌ వెంట ఓ ముగ్గురు ఆఫీస్‌ చెకింగ్‌ కోసం వచ్చారు. వాళ్లని మర్యాదపూర్వకంగా ఆఫీసులోకి తీసుకువెళ్లి డేటా చూపించసాగాడు దినేష్‌.
డేటా అంతా చెక్‌ చేసి అందరి ముందు కాకుండా క్యాబిన్లోకి ఒంటరిగా దినేష్‌ని పిలిచి ”అకౌంట్‌ ఫైల్స్‌లో చాలా తప్పులున్నాయి. కస్టమర్‌ డేటా కూడా బాలేదు. ఈ బ్రాంచ్‌ సరిగ్గా లేదని, ఎండీ గారు చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని తీసి మరొకరిని మీ స్థానంలో నియమించడానికి ఏ మార్పులైనా చేయటానికి నాకు అన్ని అధికారాలు ఇచ్చారు. ఇక్కడ పరిస్థితి అంతా చూస్తుంటే ఇదంతా మీ నిర్లక్ష్యమే అనిపిస్తోంది. మనం కరెక్ట్‌గా ఉంటేనే మన కింద పని చేసేవారు కరెక్ట్‌గా పనిచేస్తారు. మనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ కింది వాళ్లు బాగా పని చేయాలనుకోవడం అవివేకం. హాస్యాస్పదం. ఎండీ గారు నాకు చెప్పిందాని ప్రకారం మిమ్మల్ని సస్పెండ్‌ చేయాలి. కానీ మీకు భార్య పిల్లలు ఉన్నారు. ఇలా అకస్మాత్తుగా ఉద్యోగం పోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. పైగా మీరు మా ఊరి వారు. మీ నాన్నగారు చాలా మంచివారు. వీలైనంతగా అందరికీ సహాయం చేసే మనస్తత్వం కలవారు. ఆయన ముఖం చూసి నా పూచీ కత్తి మీద మీకు ఇంకో అవకాశం ఎండీ గారిని అడిగి ఇప్పిస్తాను. మీకు 40 రోజులు సమయం ఇస్తున్నాను. ఈ 40 రోజుల్లోపు ఇక్కడ అవకతవకలన్నీ సరిచేసి మీరు బాధ్యతగా పనిచేయటమే కాకుండా ఆఫీసులో పనిచేసే వారందరి చేత కూడా సక్రమంగా పని చేయించాల్సిన బాధ్యత మీదే. అప్పటికి మీరు మారకపోతే నేను కూడా ఏం చేయలేను. సస్పెన్షన్‌ తప్పదు” అని వెంకట్‌ చెప్పి కారెక్కి వెళ్లిపోయాడు.
ఆ మాటలు విన్న దినేష్‌కి ఒక్కసారి తల తిరిగినట్టు అయింది. తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. దినేష్‌ కళ్ల ముందు క్రెడిట్‌ కార్డు అప్పు, కూతురు పుట్టిన రోజుకని చేసిన అప్పు, పిల్లలు ఫీజులు, ఇంట్లో అవసరాలు పని వాళ్ల జీతాలు, అన్ని ఒక్కసారి కండ్ల ముందు కదిలాయి. వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. తనది మంచి జీతం చక్కటి హోదా. ఎంతోమంది చిన్నచిన్న ఉద్యోగాలు కూడా దొరక్కుండా నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజుల్లో ఇంకో ఉద్యోగం దొరకటం చాలా కష్టం. బాధ్యతగా పనిచేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి అని నిర్ణయించుకుని, అప్పటికప్పుడు ‘హెచ్‌ ఆర్‌’ లని ‘టీం మేనేజర్లనీ ‘పిలిచి కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణని ఉద్యోగులందరికీ ఆ పూటే చెప్పేసాడు. అందరూ సమయానికి రావాలని బాధ్యతగా పనిచేయాలని గట్టిగా చెప్పాడు.
ఇంటికి వెళ్లి భార్యాపిల్లలకు కూడా విషయం చెప్పి, తీర్చాల్సిన అప్పు గురించి చెప్పి ఖర్చులు తగ్గించాలని గట్టిగా చెప్పాడు. ప్రమీల, లాస్య, ప్రణతి కూడా ఉద్యోగం పోతే ఎలా అని కంగారుపడి ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.
దినేష్‌ బాధ్యతగా పనిచేసి ఇచ్చిన గడువు కంటే ముందే అవకతవకలన్నీ సరిచేసే పనిలో తలమునకలై ఉండగా, ఒకరోజు ఇంటికి ఉషా వదిన వచ్చింది. ఆమెను చూసేసరికి వెంకట్‌ గుర్తొచ్చి అతని గురించి అడుగుతూ ”వదిన వెంకట్‌ ఏం చేస్తున్నాడు? మా ఆఫీస్‌కి ఇన్‌స్పెక్షన్‌కు ఆఫీసర్‌గా వచ్చాడు. పెద్ద ఉద్యోగం నాకన్నా ఎక్కువ జీతం. కానీ ఎందుకు హుందాగా ఉండడు? మంచి బట్టలు వేసుకోడు? మంచి కారు బండి కొనుక్కోడు ఎందుకలా?” అని అడిగాడు.
ఆ మాటలకు ఉషా వదిన ”వెంకటేష్‌ కటిక దరిద్రంలో పెరిగాడు. అతను చిన్నప్పుడు తినటానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు. పొద్దుటే లేచి పాల ప్యాకెట్లు పేపర్లు వేసి స్కూల్‌కి వెళ్లేవాడు. సాయంత్రం వచ్చి మెకానిక్‌ షాప్‌లో పని చేసేవాడు. సెలవు వస్తే పొలం పని సిమెంట్‌ పని అనుకోకుండా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడు. చాలా కష్టపడి చదువుకునేవాడు. వెంకట్‌ తెలివితేటలు చూసి స్కూల్‌ మాస్టర్లు పుస్తకాలు పెన్నులు కొనిచ్చేవారు. మీ నాన్న కూడా అతనికి అప్పుడప్పుడు బట్టలు కొనివ్వటం పుస్తకాలకి ఫీజులకి డబ్బులు ఇవ్వటం లాంటివి చేస్తూ ఉండేవాడు. మీ నాన్న కాదు మా మామగారు కూడా ఇస్తూ ఉండేవారు. వాళ్ల నాన్న వైద్యానికి డబ్బులు సరిపోక చనిపోయాడు. డబ్బులు విషయం ఊరి వాళ్ళకి తెలిసే సరికే అలస్యం అయిపోయింది. చాలా కష్టాలు పడ్డాడు. కాబట్టే వెంకటేష్‌కి డబ్బు విలువ కష్టం విలువ బాగా తెలుసు.
70 మంది అనాధలను చేరదీసి వారి కోసం ఆశ్రమం కట్టించి వారి బాగోగులన్నీ తనే చూసుకుంటున్నాడు. తనకంటూ సొంత ఇల్లు కట్టుకోకుండా తను కూడా తల్లి భార్య పిల్లలతో ఆశ్రమంలోనే రెండు గదుల్లో ఉంటున్నాడు.
వెంకటేష్‌ భార్య కూడా చాలా మంచి అమ్మాయి. లేని కుటుంబం నుంచే వచ్చింది తను అత్తగారు కలిసి అందరికీ వంట చేస్తారు. ఒకే ఒక పని అమ్మాయిని పెట్టుకుని ఆశ్రమం పనులన్నీ చేసేస్తారు. వెంకటేష్‌ మంచి ఉద్యోగం సంపాదించుకున్నా, తనకంటూ ఒక చిన్న సొంతిల్లు కూడా లేదు. అతని అల్మరాలో 4 జతలు మించి బట్టలు కూడా ఉండవు. అదేంటని ఎవరైనా అడిగితే ”నేను ఒక బ్రాండెడ్‌ షర్టు కోసం పెట్టే ఖర్చు నలుగురు పిల్లలకి 10 రోజులకి ఆహారానికి సరిపోతుంది. కారుకో, మరొక ఆనందానికో పెట్టే ఖర్చు బదులుగా అనాధ పిల్లల కడుపు నిండుతుంది కదా! నాకు ఈ హంగులు ఆర్భాటాలు అలవాటు లేదు. వాటికోసం ఖర్చు పెట్టడం కన్నా పిల్ల తిండి కోసం ఖర్చు పెట్టడం మనసుకు చాలా తప్తిగా ఉంటుంది. అదే నాకు చాలా ఇష్టం కూడా” అంటాడు. అలాంటి మంచి మనసున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అని ఉషావదిన చెప్పి, ప్రమీలతో మాటల్లో పడింది.
ఆ మాటలు విన్న దినేష్‌ ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో వెంకట్‌ ఎంతో ఎత్తులో ఉన్నట్టుగా అనిపించింది. అతని ముందు తన్ని ఊహించుకుని సిగ్గుపడ్డాడు దినేష్‌. వెంకట్‌ మీద గౌరవభావం అభిమానం కూడా పెరిగింది. తను కూడా ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయాలనిపించింది. అంతకుముందు తను అనవసరంగా ఆడంబరాల కోసం హోదా చూపించుకోవడం కోసం పెట్టిన ఖర్చుల్ని తలుచుకుని చాలా బాధనిపించింది. ఇక నుంచి, అనవసర ఆడంబరాలు తగ్గించుకుని వెంకట్‌ లాగా ఏదైనా మంచి పని చేయాలి అని గట్టిగా నిశ్చయించుకున్నాడు దినేష్‌.
వెంకట్‌ ఇచ్చిన గడువులోపే ఆఫీసులోనే అవకతవకలన్నింటినీ సరిచేసి ఆ రిపోర్టులన్నీ కూడా వెంకట్‌కి మెయిల్‌ చేశాడు. రిపోర్ట్‌లు చూసిన వెంకట్‌ దినేష్‌కి కాల్‌ చేసి, ”చాలా తక్కువ సమయంలోనే అవకతవకలన్నీ సరి చేయడమే కాకుండా చాలా బాధ్యతగా పని చేశారు. మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం” అంటూ పొగుడుతూ ఉంటే, దినేష్‌కి సిగ్గనిపించి ”అయ్యో మీ గురించి నేను చాలా విన్నాను ఉషా వదిన చెప్పింది. మీలాగా నేను కూడా సమాజానికి ఉపయోగపడేలా బతకాలనుకుంటున్నాను. నాకు చేతనైనంతగా నేను కూడా ఏదో ఒక మంచి పని చేస్తాను. దానిలో కూడా మీ సలహా, సహకారాలు నాకు కావాలి” అంటాడు.
ఆ మాటలు విన్న వెంకటేష్‌ చాలా సంతోషించి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మనలాగా మంచి హోదాలో ఉన్నవాళ్లు సమాజం గురించి ఆలోచించగలిగితే, ఎటుచూసినా నవ్వుల పువ్వులే. మీకు నా సలహాసాకారం కావాల్సి వస్తే తప్పకుండా నేను అందిస్తాను”అని ఫోన్‌ పెట్టేసాడు వెంకటేష్‌.
ఎంతో సంతృప్తిగా ఫోన్‌ పెట్టేసిన దినేష్‌ వృద్ధాశ్రమం పెడితే ఎలా ఉంటుందా? అని ఆలోచించసాగాడు.
శశి
9553809850