పాఠకుడిని ప్రభావితం చేసే కథలు

Stories that affect the readerనెమ్మి నీలం పుస్తకం చదవడం ఆదివారం రాత్రి (6-10-2024) 11గం.లకు పూర్తయ్యింది. ఒక్క రోజులో చదివేశా.. రచయిత జయ మోహన్‌ విశ్వ మానవుడు. ఒక గొప్పపుస్తకం పాఠకుడిని ఆలోచింప చేయడమో, నవ్వించడమో, ఏడిపించడమో చేయగలగాలి… ఈ పుస్తకంలోని ప్రతి కథ అందులో ప్రస్తావించబడిన భారత చారిత్రక, సామాజిక, ఆర్థిక అంశాలు పాఠకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి…
నేసమణి, డా.కృష్ణమూర్తి, పూమేడై, కుమార పిళ్ళై, గ్యారి డేవిస్‌, సామర్వెల్‌, కెత్తెల్‌ సాయిబు… పాత్రలు సజీవంగా మన ముందు నిలిచి జీవించాల్సిన పద్ధతి గురించి కొరడాతో కొట్టి చెబుతున్నట్లుగా అనిపిస్తుంది… కచ్చితంగా పుస్తకం చదివిన వారిలో సమాజాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకొనే విధానం మారుతుంది.
ఉదా : డా. కె ”క్రిములన్నీ పసిపిల్లలే.. నడవలేవు ఎగరలేవు, వాటికి తెలిసింది తినడమొక్కటే.. పురుగులు తినడం అన్న ఏకైక విద్య తెలిసిన బొట్టంత ప్రాణం.. పురుగులను మనిషి ద్వేషించకూడదు…”
నాడార్లు కోర్టులో కుర్చీలో కాకుండా బల్ల మీద కూర్చోవాలి అని విన్నప్పుడు నేసమణి ”అణగారిన వాడికి, ఇక్కడ కుర్చీలోనే చోటు దొరకడం లేదంటే, న్యాయం ఎలా దొరుకుతుందిరా నీచపు కొడుకుల్లారా” అంటూ బల్లలు బయటకు విసిరేయడం… నాడార్‌ని పొగుడుతూ ”సింహానికి పుట్టావురా నువ్వు ! మట్టిమనిషి గట్టితనం చూపావు వాళ్లకు, మనమేరా మనకోసం నిలబడి పోరాడాల్సింది..”
వంద కుర్చీల కథలో సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలో ”మిస్టర్‌ ధర్మపాలన్‌.. నాయాడు హత్య చేసి వుంటే ఏమి తీర్పు ఇస్తావు” అంటే ”సార్‌, హత్య చేసినా నాయాడు బాధితుడే”… తన తల్లి అనాథలా పడి ఉంటే.. ”చూశారా ఈ శరీరాన్ని? ఈ శరీరంలో ప్రవహించే రక్తం అంతా తిరిపెపు కూటితో వచ్చిందే. అది నేనూ మరచిపోలేను, నాకు భిక్షం పెట్టిన ఎవరూ కూడా మరచిపోరు, మరచిపోవాలంటే నన్ను కోసి రక్తమంతా బయటకు తీసేసి వేరే రక్తం ఎక్కించాలి.. వెళ్లండి, వెళ్లి అమ్మను రెడీ చెయ్యండి”… అతని తల్లి ”కాప్పా, చొక్కా తీసెరు… కుర్చీ వద్దు.. నిన్ను బాగా చూసుకుంటాను వెళ్లిపోదాం” అనడం.. శతాబ్దాల భయం, అభద్రతను సూచిస్తుంది.
కుమార పిళ్ళై గారు శిష్యుడిని వంటగదిలోకి రావడం చూసి, ఆయన భార్య ”నా వంట గదిలో రావడానికి వాడికెంత ధైర్యం అంటే” … ”వాడు అడుగు పెట్ట లేనిచోట నాకు పనేముంది” అన్న సమాధానంతో… ఆమె మారిపోయి శిష్యుడిని కొడుకులా చూసుకోవడం …
కలరా వచ్చినపుడు, డా.సామర్వేల్‌ నిరంతరం వైద్య సేవలు అందిస్తూ గ్రామాల్లో రాత్రి పూట ”వేడి నీళ్లు తాగండి, కిళ్లాతి చేపలు తినకండి” అంటూ ప్రచారం చేస్తూ తిరగడం… దైవ దూతను తలపిస్తుంది.
”ఏంటి మీరు పిళ్ళైలా?” అంటే ”లేదు! కిందటి నెల డబ్బులిచ్చి కులం మార్పించుకున్నాను. ఇప్పుడు తోటి కులం!” అని చెప్పి జేబు దొంగగా నమోదు చేయబడి, జైలు శిక్ష అనుభవించిన పూమేడై లాంటి దేశభక్తులు దేశం కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన మహాను భావులు ఎందరో…
International registery of world citizens ప్రారంభించి డేవిస్‌ గ్యారీ ప్రపంచ పౌరుడిగా తన passport  తానే సృష్టించుకొని, ఎల్లలు లేని విశ్వమానవ సమాజం కోరుకొని, 150 దేశాలు తిరిగి, 200 సార్లు జైలుకెళ్ళిన ఆ మహానుభావుడి భావాలను, ఔన్నత్యాన్ని ఎంత మంది అర్థం చేసుకోగలం ?.. ఇంత గొప్ప పుస్తకం రాసిన రచయిత జయమోహన్‌కు, అనువాదంలా కాకుండా, తెలుగులోనే వచ్చిన పుస్తకంలాగా చక్కగా అనువాదం చేసిన అవినేని భాస్కర్‌కు హృదయపూర్వక అభినందనలు.
ఇంత అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేసిన క్రియ జగన్నాథ రావుకు ధ్యవాదములు.
– డా.విజయ లక్ష్మి, జహీరాబాద్‌.