– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్టు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రముఖ గ్లోబల్ ఐటీ, ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ టెక్‌వేవ్ హైదరాబాద్‌లోని ఐటీ పార్క్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీ రంగాన్ని హైదరాబాద్ వెలుపల రాష్ట్రంలోని టైర్-2, టైర్-3 నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలిపారు.
ప్రపంచ దిగ్గజ కంపెనీ అయిన టెక్‌వేవ్ తన పెట్టుబడులను తెలంగాణలో పెట్టడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా హైదరాబాద్‌లో 2,400, ఖమ్మంలో 500 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, నైపుణ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సమతుల్య వృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ ఐటీ సలహాదారు సాయికృష్ణ, టెక్‌వేవ్ కంపెనీ వ్యవస్థాపకులు జి.దామోదర్‌రావు, ఉపాధ్యక్షులు చంద్రారావు తదితరులు పాల్గొన్నారు.