కవిత నెత్తుకునేటప్పుడు అస్పష్ట రూప మేదో మనముందు మాట్లాడి నట్లుంటది. కానీ ఒక్కొక్క పాదం దిగి వస్తుంటే అక్కడ దుఃఖమో, ధిక్కారమో, ప్రశ్ననో మన మనసుకు దుసరి తీగలా చుట్టుకుం టుంది. దశ్యం మన కండ్లముందు నిలబడి మాట్లాడుతుంది. ఒక నవల చదివిన, నాటకం చదివిన, కవిత్వం చదివిన, మనలోకి దాన్ని సారాన్నంత ఒంపుకోవాలి. వేల ఆలోచనలు వికసించాలి. లుప్తమైపోవాలి లిప్త కాలం కవిత్వం చదివిన తర్వాత అంటాడు డా.బాణాల శ్రీనివాసరావు.
డా.బాణాల శ్రీనివాసరావు సామాన్య విశ్వకర్మ కుటుంబంలో జన్మించి అమెరికన్ బీట్ కవులు, తెలుగులో దిగంబర కవులను ఆదర్శంగా తీసుకొని సాహిత్యం వైపు అడుగులు వేశాడు. ముఖ్యంగా అలెన్ గిన్స్ బర్గ్ ప్రేరణతో అస్తిత్వవాద సాహిత్య సజన చేశాడు.
పర్యాయపదం, ఆచూకీ, రాత్రి సింఫని కుంపటి (దీర్ఘకవిత్వం) రచనలు వెలువ రించాడు. వేటికవే ప్రత్యేకమైనవి. కుంపటి దీర్ఘ కవిత్వం తన కుటుంబ వత్తిని నేపథ్యంగా తీసుకొని రాసినటువంటి అస్తిత్వవాద దీర్ఘ కవిత.
రాత్రి సింఫని కవితాసంపుటిలో ఏ కవితను తడిమిన, ఏ పాదాన్ని ముట్టుకున్న ఏదో ఒక ఆచరణాత్మకమైన సందేశాన్ని ఇస్తుంది. ”వ్యూహ గామి” కవితలో
భూమిని చీల్చే నాగలి కర్రునడుగు
చెమట చుక్కలతో సేద్యం చేస్తున్న
రైతు విషాద జీవితాన్ని
ఎన్ని కథలుగా చెబుతుందో.. (పేజీ-19)
ఏ మనిషైనా జన్మనిచ్చిన తల్లిని, బువ్వ బెట్టే అన్నదాతను యాది జేసుకోకుండా కవి కాలేడు. లోకానికి బువ్వ బెట్టె అన్నదాత దుస్థితిని నాలుగు పాదాల్లో చెప్పాడు కవి. రైతుకు నష్టం వొచ్చినా, కరువు వొచ్చినా వరదొచ్చిన అరక దున్నడం మాత్రం రైతు ఆపడు. అట్లాంటి రైతు యొక్క విషాద జీవితాన్ని మనముందు ఉంచాడు కవి.
రాలి పడుతున్న పూలతో పాటు
జారిపడుతున్న పరిమళాల
గాయాల్ని చూడాలి
ఆ గాయాలకు
కనీసం
చూపుల లేపనం రాయాలి (పేజీ -20)
కవికెంత సున్నిత హదయం ఉందో ఈ వాక్యాలను చూస్తే అర్థమవుతుంది.
ఆ గది గూటిలో అలసిపోయి
హాయిగా నిదురిస్తున్న రెండు చిన్ని పక్షులు
పక్కనే సముద్ర హౌరును తలపించే
నిరంతర సింఫని సంగీతం
దూరంగా ఎక్కడో ఓ అగంతకుడి
ప్రవేశాన్ని పసిగట్టి
నిదురించే కాలనీని
నిద్ర లేపుతున్న వీధి కుక్కలు
కవిత నెత్తుకునేటప్పుడు అస్పష్ట రూపమేదో మనముందు మాట్లాడినట్లుం టది. కానీ ఒక్కొక్క పాదం దిగివస్తుంటే అక్కడ దుఃఖమో, ధిక్కారమో, ప్రశ్ననో మన మనసుకు దుసరి తీగలా చుట్టుకుంటుంది. దశ్యం మన కండ్లముందు నిలబడి మాట్లాడుతుంది.
ఒక నవల చదివిన, నాటకం చదివిన, కవిత్వం చదివిన, మనలోకి దాన్ని సారాన్నంత ఒంపుకోవాలి. వేల ఆలోచనలు వికసించాలి. లుప్తమైపోవాలి లిప్త కాలం కవిత్వం చదివిన తర్వాత అంటాడు డా.బాణాల శ్రీనివాసరావు. ”కవిత్వశంఖం” కవితలో ఇలా అంటాడు
చరిత్రకెక్కని /మహా శిల్పాలకు ప్రాణమై
ఒక అజ్ఞానందకార నదిపై/మొలవాలి
ఒంటరి వెలుగు వంతెనవై…
నిన్ను కదిలించే/కవిత్వ పాదాల్ని
కనుపాపల కద్దుకొని /నాటుకోవాలి
మనో మైదానంలో (పేజీ -29)
హదయానికి హత్తుకునే కవిత్వం ప్రపంచంలో ఏ మూలన ఉన్న కళ్ళకు అద్దుకొని మదిలో దాసుకోవాలంటాడు. కవితా పాదం ఒకటి చాలు కదా కన్నీటిని కురిపించడానికి, కవితా వాక్యం ఒక్కటి చాలు కదా…
తన కూతురు గురించి రాసిన కవిత ”పొద్దుపొడుపు” చాలా అద్భుతంగా మలిచిన తీరు మనకు కనిపిస్తది. ఎవరు ఆ కవితను చదివినా తన కూతురును ఆ కవితలో చూసుకునేలా ఉంది.
కంటి రెప్పల్ని తెరిచి మరీ చూస్తున్న
నా చిట్టితల్లి బోసి నవ్వుల్తో
ఆవిష్కరించే సూర్యాస్తమయాల
రంగుల ప్రపంచాన్ని…
తన చిన్ని కళ్ళతో
కవిత్వీకరిస్తున్న మహాకావ్యాల్ని
మనసుతోనే చదువుకుంటున్న
(పేజీ -56)
తన కూతురి మీద ఉన్న ప్రేమను వ్యక్తీక రించిన తీరు, కవిత్వీకరించిన విధానం, అభివ్యక్తి, మనసు లోతులోకెళ్లి వచ్చిన పదాల పొందిక రెండు చేతులు చాచి కన్న కూతురును ఎత్తుకున్నట్లు ఉంటది.
మా చేతుల పెద్దబాడిశతో /ఆరుగాలం అరకల్ని చెక్కి చెక్కి
ఆకలిగొన్న దేశానికి /అన్నం పెట్టినా
అర్ధాకలితో అలమటించే/ చెదలు తిన్న చెక్క పేళ్ళం
మా పెయ్యి మగ్గాలతో /బట్టల్ని నేసినేసి
నవ నాగరిక లోకం /నగత్వాని కప్పేసినా
అతుకుల బతుకుకు /మాసికేసుకోలేని నేతగాళ్ళం (పేజీ – 70, 71)
ఇట్లా చాకలి,మంగలి, కుమ్మరి, గొల్లవారి దీనత్వాన్ని ఈ కవితలో యదార్థ దశ్యాలను చూపించాడు. ఎన్ని సంపుటాలు రాసింది కాదు ముఖ్యం. సంజీవని లాంటి ఒక్క కవితా పాదం చాలు చరిత్రపుటలో పేరు శిలాక్షరమయ్యేందుకు అంటాడు డా.బాణాల.
”రాత్రిసింఫని” కవితా సంపుటిలో ఆత్మీయ అనుబంధాలను తడిమిండు. ఆత్మాశ్రయ కవిత్వంతో పాటు తెలంగాణ ఆవశ్యకతను తెలిపిన కవితలు కూడా ఇందులో ఉన్నాయి. అట్లాగే ప్రపంచమంత వణికించిన కరోనా ప్రళయాన్ని, దాన్ని చేధించడానికి భరోసా కల్పించిన కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రపంచ నలుమూలల ఎక్కడ విధ్వంసం జరిగినా బాణాల కవితా పంక్తులు బాణాలై దూసుకొచ్చినయి. కవి చీకటిని, నిశ్శబ్దాన్ని అమితంగా ప్రేమిస్తాడు. చుట్టు జరుగుతున్న అమానవీయ దశ్యాలను తన మనసుతో సంఘర్షించి, అక్షరాలతో నిశ్శబ్ద విప్లవానికి అంకురార్పణ చేస్తడు. ఇందులో పొందుపరిచిన నలభై కవితలు వేటికవే ప్రత్యేకమైనవి.
బోల యాదయ్య 9912206427