– మాట తప్పితే పోరాటాలను ఉదృతం చేస్తాం
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరిక
నవతెలంగాణ కంఠేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన ఆమెని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపాయిలు 10000 వేతనం అమలు చేయాలని మాట తప్పితే పోరాటాలను ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం నగరంలోని ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 48 గంటల నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి నూర్జహాన్ అధ్యక్షులు శంకర్ గౌడ్, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతి, లక్ష్మి లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకిచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకిచ్చే మెనూ చార్జీలు పెండింగ్లో ఉన్నాయి. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి, వంట చేసి పెడుతున్నారు. దీంతో కార్మికులు అప్పులపాలౌతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో చేసిన వాటికే బిల్లులు రాలేదు. పైగా రాగి జావ పోయాలి, బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. బిల్లులు విడుదల చేయకుండా వండటం ఎలా ? కనుక ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరుతున్నాము. పెరిగిన వేతనం కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో మాత్రమే ఇచ్చారు. అది కూడా నెల నెలా సక్రమంగా ఇవ్వడం లేదు. ఒకపక్క ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలకనుగుణంగా పిల్లలకిచ్చే మెనూ చార్జీలు పెంచడం లేదు. కార్మికుల జీతాలు పెరగకపోగా ఉన్న జీతాలు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. కార్మికులకు ఇచ్చే జీతమే తక్కువ అది కూడా రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ పాత మెనూకే సరిపోవడం లేదు. మెనూ చార్జీలు పెంచాలని, కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేసి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లోనే వేయాలి.వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలని, రాగి జావ పోయాలని ఒత్తిడి చేస్తున్నారు. గుడ్డుకు కేటాయించిన బడ్జెట్ 2 గుడ్లే సరిపోదు. 3 గుడ్లు ఎలా పెట్టాలి. గుడ్లకు అదనం బడ్జెట్ కేటాయించాలి లేదా అంగన్వాడీ సెంటర్స్కి సప్లయ్ చేసినట్లుగా మధ్యాహ్న భోజన పథకానికి కూడా సప్లయ్ చేయాలి. రాగి జావ ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి. కార్మికులకు అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలి.రాష్ట్రమంతటా గృహలక్ష్మి పథకం పేరుతో గ్యాస్ సిలిండర్ రూ.500/- లకే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టింది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్ను సబ్సిడీకి ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10,000/-ల వేతనం వెంటనే అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నే సాబ్, సుజాత సుదర్శన్ రెడ్డి హరి శంకర్ శ్రీనివాస్ శేఖర్ శిరీష, శివకల, జయమ్మ మల్లమ్మ, సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు దీక్షకు సంఘీభావం తెలిపిన కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.