పెరుగుతున్న పట్టణ జనాభా – ‘కాగ్‌’ ఆందోళన

Growing urban population - 'cog' concernమన దేశంలో నగరాలు, పట్టణాలు సుస్థిర అభివృద్ధిని సాధించి అహ్లాదకర జీవనానికి ఉపాధి, ఉద్యోగాల కల్పనకు నెలవులుగా బాసిల్లాల్సి ఉంది. కానీ ప్రభుత్వాల అలక్ష్యం, పట్టణ స్థానిక సంస్థ దౌర్బల్యం, యంత్రాంగం ఉదాసీనత, వ్యవస్థీకృత అవినీతి మూలంగా ఇవి జీవకళను కోల్పోతున్నాయి. ఒకవైపు ఆదాయాల కొరత, మరో వైపు కిక్కిరిసిన జనసాంద్రతతో పట్టణాలు, నగరాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వీటికి తోడ్పాటునందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు, రాజ్యాంగం ద్వారా కల్పించ బడిన అధికారుల విభజన, స్వేచ్ఛ కల్పించాలి. బడ్జెట్‌లో నిధులు, వాటాలు పెంచాలి. తద్వారా మౌలిక వసతుల కల్పన పెరుగుతుంది. వ్యవస్థాగత నిర్లక్ష్యం మూలంగా చెరువులు,నాళాలు కబ్జాల కారణంగా వానాకాలంలో కొద్దిపాటి వర్షాలకే వరద నీరు ముంచెత్తడంతో పట్టణాలు,నగరాలు జనావాసాలకు వరద నీరు ముంచేస్తుంది. దీంతో కాలనీలు, రోడ్లు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు, నాలాల ఆక్రమణలతో పట్టణ, నగర ప్రజల్ని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అనే అంతుపట్టని వాతావరణం కనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ బాలుడు నాలలో పడి శవమై తేలాడు. ఇలాంటి ఘటనలు ప్రతి ఏడాది ఏదో ఓచోట జరుగుతూనే ఉన్నాయి. బాధిత కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తున్నాయి.ప్రణాళిక బద్ధమైన పట్టణీకరణతోనే ప్రజా జీవితాలు మెరుగుపడటంతో పాటు ప్రగతి ప్రస్థానం చురుగ్గా ముందుకు సాగుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీయని రీతిలో వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, సంపదను సృష్టించడం తద్వారా అభివృద్ధికి నాందిగా మారుతాయి. అంతే కాదు, దేశంలోని గ్రామీణ ప్రజల జీవితాలు ఆర్థిక ఒడిదుడుకులతో ఉద్యోగ, ఉపాధి అవ కాశాల అన్వేషణలో పట్టణాల, నగరాల బాట పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఈ వలసలతో పట్టణ భారతం జనాభా రాబోయే కాలంలో 90 కోట్లకు చేరుతుందని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో పట్టణాల, గ్రామాల మధ్య అభివృద్ధిలో సమతూకం పాటించాలి. పట్టణా(నగరా)ల్లో పెరుగుతున్న జనాభా తగినట్లుగా వసతుల కల్పనపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి.
దేశవ్యాప్తంగా నగర, పట్టణ స్థానిక సంస్థల్లో పరిస్థితులపై కంప్ట్రొలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆందోళన వ్యక్తం చేస్తుంది. వనరులకు వ్యయానికి మధ్య తీవ్ర అంతరాన్ని కాగ్‌ ఎత్తి చూపింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని పట్టణ స్థానిక సంస్థల్లో ఈ అంతరం 42 శాతంగా ఉందని గుర్తించింది. ఇవి చేసే వ్యయంలో 29శాతం మాత్రమే ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి పనికి వెళ్తున్నదని వివరించింది. వీటిలో పనిచేసే సిబ్బందిలో సగటున 37శాతం ఖాళీలు ఉన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 18 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. మనదేశంలో పట్టణ స్థానిక సంస్థల అధికారాన్ని కల్పించే 74వ రాజ్యాంగ సవరణ 1993లో అమల్లోకి వచ్చింది. అయితే, 31 ఏండ్ల తర్వాత కూడా ఈ 18 రాష్ట్రాలు ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం లేదని కాగ్‌ గుర్తించింది. 18 రాష్ట్రాల్లో 74 వ రాజ్యాంగ సవరణ అమలు విషయంలో ఆడిట్‌ నివేదికల పోలికలను కాగ్‌ ఇటీ వల విడుదల చేసింది. తెలంగాణ, ఏపీలతో పాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, ఒడిస్సా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళ నాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని మొత్తం 393 పట్టణ స్థానిక సంస్థ(యూఎల్‌ఎస్‌ జీ)లను ఇది కవర్‌ చేసింది. కాగ్‌ సమాచారం ప్రకారం.. పట్టణ సంస్థలు సగటున 32శాతం రెవెన్యూ సొంతంగా సమకూర్చుకుం టున్నాయి. మిగతాది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తుంది. పదహారు రాష్ట్రాల్లోని పట్టణ సంస్థలకు నియామకాల విషయంలో ఎలాంటి అధికారం లేకపోవడం గమనార్హం.
74వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రాలు.. పట్టణ స్థానిక సంస్థలకు పద్దెనిమిది పనుల్ని పంపిణీ చేయాలి. అందులో పట్టణ ప్రణాళిక, భూమి విని యోగం, నిర్మాణ నియంత్రణ, నీటి సరఫరా, ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళిక, ప్రజారోగ్యం వంటివి ఇందులో ఉంటాయి. నాలుగు మాత్రమే పూర్తిగా స్వయం ప్రతిపత్తితో ఉన్నాయని కాగ్‌ పేర్కొన్నది. ప్రణాళిక వంటి కీలకమైన విధుల్లో రాష్ట్రాలు పట్టణ స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయాలని కాగ్‌ సిఫారసు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నాళ్ల నిర్లక్ష్యం, రాజకీయ గ్రహణం వీడాలి. రోజురోజుకూ పెరిగిపోతున్న పట్టణ జనాభాకు ప్రణాళికాబద్ధమైన ప్రగతి చాలా అవసరమన్నది గుర్తించాలి.
మేకిరి దామోదర్‌, 9573666650