– అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ వీడ్కోలు
– గబ్బాలో మాయగాడి అనూహ్య నిర్ణయం
బంతితో మాయ చేయగలడు. అదే బంతితో బుల్లెట్ల వంటి బంతులను సంధించగలడు. బ్యాట్‌తో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించగలడు. గాయంతో ఆటకు దూరమైతే.. యూట్యూబ్ చానల్లో ఆకట్టుకునే వ్యాఖ్యాతగా మారగలడు.. అతడే భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 38 ఏండ్ల అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
నవతెలంగాణ-బ్రిస్బేన్ : భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పోటీపడుతున్న భారత జట్టులో అశ్విన్ సభ్యుడు. తొలి మూడు టెస్టుల్లో ఓ మ్యాచ్‌లో అశ్విన్ ఆడాడు. భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు బుధవారం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు తక్షణ వీడ్కోలుతో ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టుల్లో అశ్విన్ అందుబాటులో ఉండటం లేదు. గురువారమే ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగి రానున్నాడు. వీడ్కోలు టెస్టు గౌరవం ఆఫర్ చేసినా.. అశ్విన్ తక్షణమే వీడ్కోలు తీసుకుంటున్నట్టు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
ఇదే ఆఖరు రోజు : ‘నా అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో భారత క్రికెటర్‌గా ఇదే ఆఖరు రోజు. నాలో మరింత క్రికెట్ మిగిలే ఉందని నా భావన. ఆ క్రికెట్‌ను క్లబ్ స్థాయి క్రికెట్లో ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను. కానీ జాతీయ జట్టు తరఫున ఇదే నా చివరి రోజు. భారత జట్టులో ఎన్నో మధురస్మృతులు ఉన్నాయి. నా సహచర క్రికెటర్లకు, బీసీసీఐకి నా ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో భాగమైన అందరు కోచ్‌లు.. రోహిత్, కోహ్లి, రహానె, పుజారలకు సైతం కృతజ్ఞతలు. ఇది ఎంతో భావోద్వేగ నిర్ణయం. ఇప్పుడు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థితిలో ఉన్నానని నేను అనుకోవటం లేదు. కేవలం వీడ్కోలు ప్రకటన కోసమే మీడియా ముందుకొచ్చాను. మీడియా ప్రశ్నలకు మరో సమయంలో సమాధానాలు ఇస్తాను. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)తో క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తాను’ అని అశ్విన్ వెల్లడించాడు.
చాంపియన్ ఆటగాడు : 38 ఏండ్ల రవిచంద్రన్ అశ్విన్ 2010 హరారె వన్డేలో శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై చెన్నై వన్డేలో చివరగా ఆడాడు. 2011 ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్‌పై ఐదు రోజుల ఆటలో అరంగేట్రం చేసిన అశ్విన్.. ఆడిలైడ్‌లో 2024 టెస్టులో చివరి మ్యాచ్ ఆడేశాడు. టీ20 ఫార్మాట్లో 2010న జింబాబ్వేపై అరంగేట్రం చేసి.. 2022 ఆడిలైడ్‌లో చివరి టీ20 ఆడాడు. భారత్‌కు 106 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన అశ్విన్ 24 సగటుతో 537 వికెట్లు పడగొట్టాడు. 25 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (619) తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్ కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు కూల్చిన స్పిన్నర్లలో టాప్-4లో నిలిచాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. 65 టీ20ల్లో 72 వికెట్లు తీసుకున్నాడు. బ్యాట్‌తోనూ అశ్విన్ సత్తా చాటాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు, 14 అర్థ సెంచరీలతో 3503 పరుగులు చేశాడు. వన్డేల్లో ఓ అర్థ సెంచరీతో 707 పరుగులు, టీ20ల్లో 184 పరుగులు సాధించాడు.