– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీఆర్‌ఎస్ నాయకులు రోజుకో రీతిలో నిరసన పేరుతో విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తమ ప్రభుత్వం చక్కటి పాలసీలు తెస్తుంటే, బీఆర్‌ఎస్ వాట్సాప్ యూనివర్సిటీ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు చలో రాజ్ భవన్ చేపట్టామని, రోడ్డుపై బైటాయించి ప్రధాని, అదానీ ఒక్కటైనట్టు నినదించినట్టు చెప్పారు. మణిపూర్‌లో మానవీయ ఘటనలు జరుగుతున్నా ప్రధాని సోయి లేకుండా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. ప్రధాని, అదానీ అంశంలో బీజేపీ నాయకులు స్పందించాలి కానీ, హరీశ్‌రావుకు ఏం నొప్పి అని ప్రశ్నించారు. దీన్ని బట్టి బీజేపీ, బీఆర్‌ఎస్ భారు భారు అని స్పష్టం అవుతోందన్నారు. హరీశ్‌రావు వైఖరి బీజేపీకి బీ-టీమ్ అన్నట్టు కనిపిస్తున్నదని, అందువల్ల బీఆర్‌ఎస్‌ని బీజేపీలో విలీనం చేసుకోవాలని సూచించారు. తాము అదానీతో చట్ట వ్యతిరేక ఒప్పందాలు ఒక్కటీ చేసుకోలేదని చెప్పారు. దేశ సంపదను దోచుకుంటున్న అదానీపై జేపీసీ వేయడానికి తాము అసెంబ్లీలో తీర్మానం పెడతామని, మద్దతు ఇవ్వాలని కోరారు. పదేండ్ల కిందట 600వ స్థానంలో ఉన్న అదానీ మూడో స్థానానికి ఎలా ఎదిగారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.
బీఆర్‌ఎస్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు :ఎమ్మెల్యే మట్టా రాగమయి
బీఆర్‌ఎస్ నాయకుల హడావిడిని ప్రజలు గమనిస్తు న్నారని, అసెంబ్లీ సజావుగా సాగకుండా ప్రతి రోజూ డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గడిచిన పదేండ్లలో ఆటో కార్మికుల సమస్యలు పట్టించుకోలేని వాళ్లు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు ఈ పథ కం ద్వారా నెలకు రూ.5 వేల నుంచి 6వేల వరకు లబ్ది చేకూరు తోందన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆద రణ చూసి ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను త్వరలోనే ముఖ్యమంత్రి అమలు చేస్తారని చెప్పారు.
కేసీఆర్ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనాలి :ఎమ్మెల్సీ బల్మూరి
ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నర్సింగ్‌రావు కోరారు. చట్ట సభలను, రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. బావాబామ్మర్దులు బలహీన వర్గాల వారికి సంకెళ్లు వేసి వాళ్లు దొరల లెక్క వెనక వస్తున్నారని, రేపు సంకెళ్లు పడేది ముందే ప్రాక్టీస్ చేసినట్టు ఉందన్నారు. ఏ అంశం మాట్లాడినా ఆయనను లోపల వేస్తారని కేటీఆర్ అంటున్నారని, ప్రజా ప్రభుత్వంలో ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉంటుందని చెప్పారు. దాని ప్రకారమే చర్యలు ఉంటాయన్నారు. అసెంబ్లీలో తాము ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. చేసిన తప్పులు అంగీకరించకపోవడం మరో తప్పు అని, మాట్లాడే ముందు పదేండ్ల కాలంలో మీరు ఏ విధంగా వ్యవహరించారో చర్చ పెట్టాలన్నారు.