రికార్డు పుటల్లో రీచా ఘోష్‌

Richa– టి20ల్లో 18బంతుల్లోనే అర్ధసెంచరీ
– మళ్లీ మెరిసిన మంధాన
ముంబయి: వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన మూడో టి20లో కీపర్‌ రీచా ఘోష్‌ రికార్డు కదం తొక్కింది. కేవలం 18బంతుల్లోనే అర్ధసెంచరీని కొట్టింది. దీంతో 2015లో సోఫీ డివైన్‌(న్యూజిలాండ్‌) పేర ఉన్న 18బంతుల్లోనే అర్ధసెంచరీ రికార్డును సమం చేసింది. రీచా అర్ధసెంచరీకి తోడు.. కెప్టెన్‌ స్మృతి మంధాన కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 217పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌ చివరి బంతికే ఓపెనర్‌ ఉమా ఛెత్రి (0) డకౌట్‌ అయ్యింది. హెన్రీ బౌలింగ్‌లో జోసెఫ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్‌ మంధాన ఇన్నింగ్స్‌ నిర్మించింది. క్రీజులో నిలదొక్కుకుంటూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. జోరుమీద ఉన్న ఈ జోడీని ఫ్లెచర్‌ విడగొట్టింది. జట్టు స్కోరు 99 పరుగుల వద్ద రోడ్రిగ్స్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మంధాన కూడా డాటిన్‌ బౌలింగ్‌లో హెన్రీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. చివర్లో రిచా ఘోష్‌, బిస్త్‌ దూకుడుగా ఆడటంతో భారత్‌ భారీ స్కోరే చేసింది. కెప్టెన్‌ మంధాన(77; 47బంతుల్లో 13ఫోర్లు, సిక్సర్‌) వరుసగా మూడో అర్ధసెంచరీతో రాణించగా.. రోడ్రిగ్స్‌(39) ఫర్వాలేదనిపించింది. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత రీచా ఘోష్‌ కేవలం 18బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి ఈ ఫార్మట్‌లో వేగంగా అర్ధసెంచరీ రికార్డును సమం చేసింది. రీచా ఘోష్‌(54; 21బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌్‌తో చెలరేగింది. దీంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 217పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. వెస్టిండీస్‌ బౌలర్లు హెన్రీ, డోటిన్‌, అలియానే, ఫ్రెచర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
భారత్‌ మహిళల ఇన్నింగ్స్‌: మంధాన (సి)హెన్రీ (బి)డోటిన్‌ 77, ఛెత్రి (సి)జోసెఫ్‌ (బి)హెన్రీ 0, రోడ్రిగ్స్‌ (ఎల్‌బి)ఫ్రేచర్‌ 39, బిస్ట్‌ (నాటౌట్‌) 31, రీచా (సి)హెన్రీ (బి)అలియానే 54, సజన (నాటౌట్‌) 4, అదనం 12. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 217పరుగులు
వికెట్ల పతనం: 1/1, 2/99, 3/143, 4/213
బౌలింగ్‌: హెన్రీ 2-0-14-1, డోటిన్‌ 4-0-54-1, మాథ్యూస్‌ 4-0-34-0, కరిష్మా 3-0-44-0, అలియానే 4-0-45-1, ప్రేచర్‌ 3-0-24-1.
మహిళల టి20ల్లో టాప్‌-5 రికార్డులు..
అత్యధిక అర్ధసెంచరీ…
1. మంధాన(ఇండియా) : 30(142 ఇన్నింగ్స్‌)
2. సూజీ బేట్స్‌(న్యూజిలాండ్‌) : 29(168 ఇన్నింగ్స్‌)
3. బెత్‌ మూనీ(ఆస్ట్రేలియా) : 25(100 ఇన్నింగ్స్‌)
4. స్టఫనీ టేలర్‌(వెస్టిండీస్‌) : 22(122 ఇన్నింగ్స్‌)
5. సోఫీ డివైన్‌(న్యూజిలాండ్‌) : 22(139 ఇన్నింగ్స్‌)
తక్కువ బంతుల్లో అర్ధసెంచరీలు..
1. రీచా ఘోష్‌(ఇండియా) : 18బంతుల్లో వెస్టిండీస్‌పై, 2024
2. సోఫీ డివైన్‌(న్యూజిలాండ్‌) : 18బంతుల్లో ఇండియాపై, 2015
3. లిచ్‌ఫీల్డ్‌(ఆస్ట్రేలియా) : 18బంతుల్లో, వెస్టిండీస్‌పై, 2023
4. నదీ ధార్‌(పాకిస్తాన్‌) : 19బంతుల్లో, దక్షిణాఫ్రికాపై, 2019
టి20ల్లో భారత మహిళల అత్యధిక స్కోర్లు…
217 : వెస్టిండీస్‌పై 2024
210 : యుఏఇపై, 2024
198 : ఇంగ్లండ్‌పై, 2018
195 : వెస్టిండీస్‌పై, 2024
194 : న్యూజిలాండ్‌పై, 2018