నా మాటలు వక్రీకరించారు

– రాజగోపాల్‌ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
నూతన సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తే బాగుంటుందన్న తన వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. ఎన్టీఆర్‌ అంటే నాకు గౌరవమనీ, ఆయన లెజెండరీ నాయకుడని అన్నారు. ఆయనంటే అందరికీ అభిమానమని కొనియాడారు. తాను ఎన్టీఆర్‌ ఘాట్‌ తొలగించి కొత్త అసెంబ్లీ కట్టాలని అన్నట్టుగా నేను అనని మాటల్ని అన్నానని వక్రీకరించి దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్వక్తం చేశారు .నా ఎదుగుదలను అడ్డుకునే కుట్ర జరుగుతున్నదనీ, దయచేసి మరోసారి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు పునరావతం కాకుండా చూడాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వచ్చిన పదేండ్ల తరువాత కూడా ఆంధ్ర మీడియా రాష్ట్ర రాజకీయాలను శాసించాలని చూస్తున్నదని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని మేము ఏ మాత్రం ఒప్పుకోబోమన్నారు. ఎన్టీఆర్‌ అంటే మాకు గౌరవం ఉందనీ, కానీ ఆంధ్ర మీడియా నా మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. కొందరు మమ్మల్ని వివరణ అడుగుతున్నారనీ, మాకు కూడా ఆత్మగౌరవం ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ప్రాణహిత- చేవెళ్లను పక్కకు పెట్టారన్న రాజగోపాల్‌రెడ్డి, రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. ఎవరిని అడగకుండానే విపరీతంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచుకున్నారని చెప్పారు. ఎక్కడి నుంచి నీరు తీసుకో వాలో నిర్ధారించకుండానే డిండి ఎత్తిపోతల చేపట్టారన్నారు. ఇంజినీర్లను అడగకుండానే కేసీఆర్‌ ఒక్కరే నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మేశారని ఆరోపించారు.