రాత్రి 11 గంటల వరకు కొనసాగిన అసెంబ్లీ

– మున్సిపాల్టీ సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుకు ఆమోదం
– సభ శుక్రవారానికి వాయిదా
– నేడు భూ భారతిపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ రాష్ట్ర శాసనసభ గురువారం రాత్రి 11 గంటల వరకూ కొనసాగింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రతిపాదించిన మున్సిపాల్టీ సవరణ బిల్లు, మరో మంత్రి సీతక్క ప్రతిపాదించిన పంచాయతీరాజ్‌ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మున్సిపాల్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. పంచాయతీరాజ్‌ సవరణ బిల్లులో…’ హైదరాబాద్‌ సమీపంలోని ఓ.ఆర్‌.ఆర్‌ పరిధిలో ఉన్న 51 గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండి పట్టణ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో విలీనం చేయాలి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పట్టణ ప్రాంత లక్షణాలు కలిగి ఉన్న 80 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లుగా మార్చాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు జరపడానికి డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించి పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేయాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ ట్రిబ్యునల్‌ సలహా మేరకు సవరణలను పంచాయతీరాజ్‌ చట్టంలో పొందుపరిచాం. ఆ చట్టంలో షెడ్యూల్‌ 8 లోని 147 పంచాయితీలకు సంబంధించిన తప్పులను సవరించుటకు గాను కొన్ని సవరణలు ప్రతిపాదించాం…’అని ప్రభుత్వం పేర్కొంది. ఈ సవరణ చట్టాన్ని ఆమోదించిన అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. భూ భారతిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు వీలుగా శుక్రవారం ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. దానిపై చర్చ అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నాయి.