గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్

నవతెలంగాణ -తాడ్వాయి 
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల చరిత్రలో పోడు  రైతులకు హక్కులు కల్పించేందుకు ఏర్పాటుచేసిన పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేసిన నాటి నుండి ఇప్పటివరకు గత ప్రభుత్వాలు మూడు లక్షల ఎకరాలకు పట్టాల పంపిణీ చేస్తే సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పరిపాలనలోనే ఒకే రోజు నాలుగు లక్షల 60 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించి ఏజెన్సీలో గిరిజన జీవితాల్లో వెలుగులు కేసీఆర్ నింపాడని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మంత్రి సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో జిల్లా కలెక్టర్ యస్.  క్రిష్ణ ఆదిత్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ములుగు జిల్లా కు చెందిన పోడు భూముల సాగు దారులకు అటవీ (పోడు భూముల) హక్కు పత్రాలు, జిల్లా లో ప్రభుత్వ నిషేధిత సంస్థల్లో పనిచేస్తూ లొంగిపోయిన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సేవాలాల్, కొమురం భీమ్ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ములుగు జెడ్ పి చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పీఓ అంకిత్, ఓఎస్ డి అశోక్ కుమార్, గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య,  మహబూబాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్ లతో కలిసి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు హక్కు పత్రాలను అందిస్తూ రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేసే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చూస్తుంటే మేడారం మహా జాతరను తలపిస్తున్నదని అన్నారు. అర్హులైన ప్రతి సాగుదానికి హక్కు పత్రం అందాలనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గిరిజన రైతులకు పోడు పట్టాలను అందించడంతోపాటు అర్హులైన గిరిజనేతర రైతులకు సైతం పట్టాలు కచ్చితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ఏకైక కలెక్టర్ ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గిరిజనులకు ఎన్నో ఇబ్బందులు తప్పాయ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా ఒకే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 కుటుంబాలకు లబ్ది కలిగే విధంగా నాలుగు లక్షల అరవై వేల ఎగరాల భూములకు హక్కుపత్రాలను అందించడం జరిగింది అన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలను అందించిన అనంతరం రైతుబంధు, రైతు బీమా పథకాన్ని వర్తింప చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ 406 కోట్లను వెచ్చించనున్నది అన్నారు. పోడు హక్కుల చట్టం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో విడుదలవారీగా మూడు లక్షల ఎకరాలకు పట్టాలు అందిస్తే సీఎం కేసీఆర్ రికార్డు స్థాయిలో ఓకే విడతలో నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు పట్టాలు అందించారన్నారు. గిరిజన విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించేందుకు తగిన వసతులను ఏర్పాటు చేయడంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో గత 75 ఏళ్లుగా 90 గురుకులాలు ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో 95 గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 332 ఆశ్రమ పాఠశాలలో  విద్యార్థులు ఉంటే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య లక్ష 30 వేలకు చేరిందన్నారు. గిరిజన గిరిజనేతర రైతులకు అందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. గిరిజనులు ఏవైనా కారణాలతో పత్రాలు పొందనట్లయితే తగిన చర్యలు చేపట్టి హక్కు పత్రాలను అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోడు భూముల చట్టంలోని విధానాలతోనే హక్కు పత్రాలు జరిగిందన్నారు. గిరిజనేతర రైతుల భూముల జోలికి అటవీశాఖ అధికారులు వస్తే ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని అన్నారు. గత పాలకులు ప్రజల సంక్షేమం కోసం దృష్టి సారిస్తే నేడు ఈ పరిస్థితులు ఉండేవి కావని అన్నారు. తమ పాలనలో అవకాశం ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పాటుపడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఐటీడీఏలను బలోపేతం చేసి ఐఏఎస్ అధికారులు నియమించి గిరిజనులకు సేవలందిస్తానున్నమన్నారు. పోడు సాగుదారులకు ఇచ్చిన భూములను సాగు భూమి మీద మార్చేందుకు ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న నేత సీఎం గా ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.
      ఈ కార్యక్రమములో ఎంపిపి వాణిశ్రీ, శ్రీనివాస్, శ్రీదేవి, జెడ్పీటీసీ పాయం రమణ, హరిబాబు, భవాని, కో ఆప్షన్ మెంబర్ వలియా బి,  మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ పూజారిలు జగ్గారావు, ఉపేందర్, ఆదివాసులసంఘం అధ్యక్షుడు మహిపాల్, మేడారం సర్పంచ్ బాబురావు, మండల స్పెషల్ ఆఫీసర్ లు ఆర్డీవో రమాదేవి, సీఈఓ  ప్రసూనా రాణి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, జిల్లా సహకార అధికారి సర్దార్  సింగ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ (టిడబ్ల్యు) ఐటిడిఎ పోచం, జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ అప్పయ్య, ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ B.V. రమణ,  తహశీల్దార్లు  శ్రీనివాస్, సత్య నారాయణ, ఎంపిడి ఓ లు, గిరిజనులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.