కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాక్షాత్తూ రాజ్యసభలో బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరును ఉచ్ఛరిస్తూ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 75 ఏండ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలోనే- ఆ రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆయన తక్షణం క్షమాపణ చెప్పటంతో పాటు తన పదవి నుంచి వైదొలగాలని విపక్షాలు డిమాండు చేశాయి. పార్లమెంటు బయట పెద్దఎత్తున నిరసన తెలిపాయి. బుధ, గురువారాల్లో కూడా పార్లమెంటులోనూ, దేశవ్యాప్తంగానూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ‘అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్.. అంబేద్కర్ అనటం ఫ్యాషనై పోయింది. అదేదో వందసార్లు భగవంతుడి పేరు ఉచ్ఛరించినా స్వర్గలోకంలో స్థానం దొరుకుతుంది.” అంటూ అమిత్ షా విపక్షాలపై విరుచుకుపడుతూ, తన మనువాద ధోరణిని బయటపెట్టు కున్నారు. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించటమే నేరమన్నట్టుగా అసహనం ప్రదర్శించి, బీజేపీ అసలు బుద్ధిని చూపించుకున్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాకైనా ఆయన చేసిన తప్పుకు లెంపలేసుకొని సభను క్షమాపణ కోరాల్సింది. ఆ పని చేయకపోగా అన్ని సందర్భాల్లాగానే ఈసారి కూడా విపక్షాలపై విరుచుకుపడ్డమే విధానంగా హోంమంత్రి, ఆయన పరివార గణమూ వ్యవహరించటం సిగ్గుచేటు. తగుదునమ్మా అని ప్రధాని మోడీ తన అనుంగు అనుచరుడిని వెనకేసుకురావటం, ఎప్పటిలాగానే నెహ్రూని, కాంగ్రెస్‌ని రంగంలోకి లాక్కొచ్చి పాత పాటలే వల్లెవేయడం దబాయింపు ధోరణికి పరాకాష్ట.
అమిత్‌షా అక్కసు వాక్కులు అప్పటికప్పుడు అనుకోకుండా, ఆవేశపరంగా వచ్చినవి కావు. సంఘ పరివారం అణువణువునా అంబేద్కర్ పట్ల జీర్ణించుకొని ఉన్న అసహనపు భావజాలానికి బహిర్గత వ్యక్తీకరణే అది. దేశానికి దశాదిశా నిర్ణయించుకొని, అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగం రూపొందించుకొన్న తరుణంలో నేటి బీజేపీ మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము అత్యంత ప్రామాణికంగా భావించే మనుస్మృతికి స్థానం లేకుండా పోయిందే అని స్వయంగా గోల్వాల్కర్ తమ ‘ఆర్గనైజర్’ పత్రికలో వ్యాసాలు రాసుకున్నారు. దేశానికి ఈ రాజ్యాంగం పనికిరాదని, మూడు రంగుల జెండా అరిష్టమని పేర్కొనటమే కాదు; కొంతమంది రాష్ట్ర ప్రేమి యువదళ్ కార్యకర్తలు 2021లో నాగ్‌పూర్ ఆర్‌ఆర్‌ఎస్ కార్యాలయం మీద బలవంతంగా మువ్వన్నెల జెండా ఎగురవేసేదాకా వాళ్లు జాతీయజెండాను గుర్తించలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి రాజ్యాంగంపై విరుచుకుపడడం చాలామంది కాషాయదళ నాయకులకు అలవాటే. గత లోక్‌సభ ఎన్నికల తరుణంలో 400 సీట్లు సాధిస్తే రాజ్యాంగం మార్చి తీరుతామంటూ కొంతమంది బీజేపీ ఎంపీలు బాహాటంగా ప్రకటించిన సంగతి విదితమే! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించిన తీరుగానే బీజేపీ అంబేద్కర్ పట్ల వ్యవహరిస్తూ ఉంటుంది. ఆయన విగ్రహానికి భారీగా పూలదండలు వేసి, ఘనంగా కబుర్లు చెప్పటం; రాజ్యాంగం నిర్దేశించిన విలువలను, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ఆ పార్టీ కపట నీతి.
మనుస్మృతి అత్యంత దుర్మార్గమైనదని, ఈ దేశానికి ఏమాత్రం పనికిరాదని అంబేద్కరే స్వయంగా దానిని దగ్ధం చేశారు. అలాంటి కాలం చెల్లిన క్రూరమైన మనువాదాన్ని నెత్తిన పెట్టుకొని, సనాతనమే తమ అభిమతంగా ఊరేగే బీజేపీగణం ఇక అంబేద్కర్ మహాశయుడి మార్గాన్ని ఎక్కడ గౌరవిస్తుంది? లోన ఒకటి బోధిస్తూ, అభిమానిస్తూ, బయట రకరకాల రంగులు మార్చే నటనా విన్యాసాలు చేయడం; అధికార అవసరాలకు తగ్గట్టుగా అబద్ధాలకు తెగించటం సావార్కర్ కాలం నుంచీ సంఫ్‌ు పరివారానికి అలవాటు. వర్ణవ్యవస్థ విషవలయం నుంచి దేశం బయటపడాలన్న ఆధునాతన ఆచరణ అంబేద్కర్‌దైతే, దేశాన్ని మళ్లీ వెయ్యి పడగల విషపు నాగు నీడలోకి లాక్కుపోవడమే బీజేపీ సనాతన పన్నాగం. ఈ రెండింటి మధ్య ఆకాశానికి, అథ:పాతాళానికి ఉన్నంత అంతరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా అసహనం లోంచి అహంకారపు వ్యాఖ్యలు బయటకొచ్చాయి. ఈ తరహా పెత్తందారీ పోకడలు భారత రాజ్యాంగపు స్ఫూర్తికి ప్రమాదకరం. కాబట్టి హోంమంత్రి అమిత్ షా బుకాయింపు పర్వాన్ని కట్టిపెట్టి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా ప్రాప్తించిన పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలి.