పెద్దాయన శయనమందిరంలోకి వచ్చాడు. నిద్రపోయే ముందు ఆరోజు చేసిన పనులను సమీక్షించుకుని, రేపటికి ఏం చేయాలో ప్రణాళికలు వేసుకోవడం ఆయనకు అలవాటు. దాని ప్రకారం సభలో జరిగిన దాని గురించి ఆలోచించాడు. గతవారం రోజుల నుండి సభలో జరిగిన చర్చలు పెద్దా యనకు చికాకు తెప్పించాయి. సరిగ్గా చెప్పాలంటే తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ప్రత్యర్థి తన ప్రియమిత్రుడు తీవ్ర ఆగహ్రం కలిగించాయి. తన ప్రియ మిత్రుడు వ్యాపారంలో చేస్తున్న అక్రమాల గురించి ప్రత్యర్థి శిబిరం అదేపనిగా చర్చించటం పెద్దాయనకు నచ్చలేదు. పైగా తన ప్రియమిత్రుడినే అరెస్టు చేయాలని ఒత్తిడి చేయడం ఆయనకు ఆగ్రహం కలిగించింది.
యధావిధిగానే తానేమీ మాట్లాడలేదు. విమర్శలకు, ఆరోపణలకు సమాధానం తినేవాడు సమాధానం చెప్పలేదు. చెప్పబోడు కూడా. అందుకే మౌనం!
అయినా ప్రియమిత్రుడికి అతడు చేసే అన్నిరకాల పనులకు పూర్తి సహకారం అందించడం మిత్రధర్మం కదా! ఇది మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నదే కదా! దాన్నే తాను ఆచరించాడు! పురాణాల గురించి పూర్తిగా తెలియని మూర్ఖులు తన మిత్రుడినే అరెస్టు చేయమంటే తాను అరెస్టు చేస్తాడా?
రాజకీయ నాయకులకు ఆదర్శపురుషుడైన శ్రీకృష్ణుడు పాటించిన మిత్రధర్మాన్నే తాను అను సరించాడు కదా! తన ప్రియమిత్రుడైన కుచేలుడి వద్దనున్న అటుకులు తీసుకుని, అందుకు బదులుగా కుచేలుడికి సకల సంపదలు ప్రసాదించాడు కదా! రుక్మిణి అడ్డుపడకపోతే తన రాజ్యాన్ని కూడా ధార పోసేవాడే! కుచేలుడు అటుకులు పెట్టడానికి మొహమాటపడితే, స్నేహితుని వద్ద మొహ మాటా లెందుకని, కుచేలుడి వద్దనున్న అటుకుల ముల్లె శ్రీకృష్ణుడు లాక్కోలేదూ? అటుకులను లంచం అనగలరా ఎవరైనా? స్నేహితుడికి ఏం కావాలో చేసి పెట్టడమే కాదు, స్నేహితుడి వద్ద నుండి తీసుకోవడం కూడా మిత్రధర్మమే! అటుకులు తిన్నాకే శ్రీకృష్ణుడు, కుచేలుడికి సకలసంపదలు ఇచ్చాడు! తాను కూడా అంతేకదా! గతంలో తీసుకున్నాడు, ఇపుడు తిరిగి ఇస్తున్నాడు! ఇంత చిన్న ధర్మసూక్ష్మం అర్థం కాకపోతే ఎట్లా!
పెద్దాయన మదిలో ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి.
సకల జనులకి, సకల ప్రాణులకీ ఆదర్శమూర్తియైన శ్రీరామచంద్రమూర్తి మిత్రధర్మానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? మాతా సీతను వెతికే క్రమంలో సుగ్రీవుడితో స్నేహం కలిసింది. స్నేహితుడైన సుగ్రీవుడి కోసం అత్యత బలశాలియైన వాలితో శ్రీరాముడు వైరం పెట్టు కోలేదా? స్నేహితుడి కోసం వాలిని చంపటమే కాదు! వాలి రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించలేదా? మరి శ్రీరాముడు హత్యచేశాడని ఎవరైనా అనగలరా? వాలి భార్య తారను సుగ్రీవుడు ఏలుకుంటుంటే శ్రీరాముడు మౌనం దాల్చలేదూ! సుగ్రీవుడు కూడా శ్రీరాముడి కోసం ఏకంగా సముద్రంపై వారధినే కట్టినాడు కదా! వారధిని లంచం అనీ, తర్వాత శ్రీరాముడికి సమర్పించుకున్నాడని ఎవరైనా అనగలరా? అదంతా మిత్రధర్మం కదా!
సుగ్రీవుల స్నేహం ప్రపం చానికి మేలు చేస్తుందని హనుమాన్ ఆనాడే సెలవి చ్చాడు కదా! తాను, తన ప్రియమిత్రుడి కోసం చేస్తున్న దానిని ఇలాగే చూడాలి కదా! తమ స్నేహం భారతదేశం ఎల్లలుదాటి, శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా లాంటి విదేశాలకు విస్తరించింది కదా! త్రేతాయుగంలో హనుమాన్ చెప్పిన మాటలు కలియుగంలో పునరావృతం అవుతున్నాయని అందరూ అనుకుంటుంటే, తన మిత్రుడినీ తానే అరెస్టు చేయాలని డిమాండ్ చేయటం హాస్యాస్పదం కదా?
శ్రీరాముడి స్నేహతత్వమును వీరెప్పుడు అర్థం చేసుకుంటారో! రాముడితో యుద్ధం చేసే సమయంలో నరుకుతున్న రావణుడి తలలు తిరిగి పుట్టుకొస్తున్న సమయంలో తన స్నేహితుడైన విభీషణుడి సలహాతోనే రావణుడి నాభిలోని అమృతభాండాన్ని శ్రీరాముడు బద్దలు కొట్టి విజయం సాధించాడు కదా! ఆతర్వాత లంకకు విభీషణుడినే రాజుగా చేశాడు. విభీషణుడు ఇచ్చిన సలహాను లంచం అనీ, భ్రాృతృద్రోహం అని ఎవరైనా అంటారా? తన స్నేహితుడైన శ్రీరాముడిని గెలిపించుటకు విభీషణుడు సలహా ఇచ్చాడు! రాజులేని లంకకు రాముడు విభీషణుడిని రాజుగా చేశాడు! ఇద్దరూ తమ మిత్ర ధర్మాన్ని పాటించారు! ఇందులో ఆక్రమం, లంచం, భ్రాృతృద్రోహం ఇలాంటి వాటి ప్రసక్తి ఎక్కడీ
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తాను అంతా మిత్రధర్మాన్నే పాటిస్తున్నాము. అంటే తాము అంతా ఒకే కోవకు చెందిన వారము కదా! సరిగ్గా చెప్పాలంటే తాము ముగ్గురం ఒకటే! ఈ విషయం చాలామంది భక్తులు తెలుసుకున్నారు! ఈ దైవ రహస్యాన్ని ఇంకా తెలుసుకోలేని మూఢులు కొందరు సభలో, సభ బయటా అరెస్ట్టులు అంటూ అవాకులు, చెవాకులు పేలుతున్నారు! వారిని దారి మళ్లించేందుకు తాను రెండు రోజుల కిందట వేసిన ప్రణాళిక చక్కగా పనిచేసింది! ఇందులో కూడా మిత్రధర్మమే పనిచేసింది! తన మరో మిత్రుడు తన ప్రణాళికను చక్కగా సభలో అమలుచేసి మిత్రధర్మాన్ని చాటుకున్నాడు.
ఈ దేశంలో బడుగు, బలహీన, దళిత, బహుజన ప్రజానీకం దేవుడిగా భావించే నాయకుడిని తన మిత్రుడు తృణీకరిస్తూ సభలో మాట్లాడారు! ఆ నాయకుడిని తలుచుకునే బదులు దేవుడిని తలుచు కుంటే స్వర్గం దక్కేదని తన మిత్రుడు సభలో ప్రకటించి, ప్రత్యర్థులను విజయవంతంగా దారి మళ్లిం చాడు! ఇప్పుడు తన స్నేహితుడి అక్రమాల గురించి చర్చించేవారులేరు! అరెస్టు చేయమని డిమాండ్ చేసేవారు అసలే లేరు! అంతా ఒకటే చర్చ! దళిత నాయకుడు – దేవుడు – స్వర్గం అంతే! తన మిత్రుడి గురించి చర్చ జరిగినన్ని రోజులు తాను మౌనంగా ఉండాల్సి వచ్చింది! ఇప్పుడు జూలు విదిల్చిన సిం హంలా సభలో గర్జిస్తున్నాడు.తన ప్రత్యర్థుల తాతముత్తాతల గురించి గంటలకొద్దీ ఏకిపాకం పెడుతున్నాడు!
ఏదేమైనా సకాలంలో మిత్రధర్మం పాటించిన తన మరో మిత్రుడికి మనసులోనే అభినందనలు తెలిపి, పెద్దాయన గాఢ నిద్రలోకి జారుకున్నాడు.