‘ఈ విశాల విశ్వమంతటా అన్ని గణితీయంగానే సంభవిస్తాయి’ అని లైబినిడ్జ్ అనే గణిత శాస్త్రజ్ఞుడు అంటాడు.మానవుడు పసిబిడ్డగా ఈభూమిపైకి వచ్చిన నాటి నుండి మరణం వరకు ప్రతిక్షణంలో, ప్రతి సందర్భంలోనూ గణితాన్ని ఉపయోగిస్తాడు.అందువలన గణితం మానవ జీవితంతో అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఆటాడుకునే పిల్లవాని నుండి మొదలుకుని అంతరిక్ష యాత్రికుని వరకు గణితాన్ని ఉపయోగించకుండా ఎవరూ ఉండలేరు. అసలు గణితాన్ని వాడకుండా ఒక్కక్షణం కూడా ముందుకు సాగలేమంటే అతిశయోక్తి కాదేమో. గణితం అంతగా మానవ జీవితంతో పెనవేసుకుంది. కాలక్రమేణా మానవ నాగరికతతో పాటు గణితం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అందువలనే మానవ మనుగడకు గణితం అద్దం లాంటిది. గణితశాస్త్రం అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు శ్రీనివాస రామానుజన్. అతను గణితానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22ను భారత ప్రభుత్వం జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది.
శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడులో జన్మించాడు. 1920 ఏప్రిల్ 26న మరణించాడు. అతని జీవిత కాలం 32 సంవత్సరాల 4 నెలల 4 రోజులు మాత్రమే. అయినప్పటికీ వందల సంవత్సరాలకు సరిపడా చరిత్రను లిఖించాడు. రామానుజన్‌కు చిన్నప్పటి నుండి గణితంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. తన పదకొండవ యేటా గణిత శాస్త్రం పట్ల అద్భుతమైన దృష్టిని కన బరిచాడు. సంఖ్యలపై రామానుజన్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. సాధారణమైన గణితానికి భిన్నమైన పద్ధతులు ఆవిష్కరించాడు. ఇతను ప్రధాన సంఖ్యలు, వింతచదరాలు, వితత భిన్నాలు, వర్గమూలాల గూడు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రాల్స్‌పై పరిశోధన చేశాడు. ఆయన పేరుపై గల రామానుజన్ సంఖ్య 1729 ఇందుకు ఒక ఉదాహరణ. ఫెలో ఆఫ్ ది రాయల్స్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు. గణితంపై ఇతనికి ఉన్న పరిశోధనా శక్తి మాత్రం అమోఘం. అలాగే ఇండియన్ మేథమెటికల్ సొసైటీ అనే పత్రికలో ఇతని వ్యాసాలు అనేకం ప్రచురితమయ్యాయి. ఇక రామానుజన్ చివరి దశలో మాక్ తీట ఫంక్షన్స్‌పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. రామానుజన్ గణిత శాస్త్రజ్ఞుడు అనే కన్నా, ఆయన మానవ మేధస్సు ఎంత చేయగలదో నిరూపించిన శక్తిమంతుడు. ఒక మహనది లాంటిది రామానుజన్ జీవితం. నది ఎలాగైతే ప్రవహించినంత మేర పరిసరాలన్ని సస్యశ్యామలం చేస్తుందో, అలాగే రామానుజన్ వేసిన ప్రతి అడుగు గణిత శాస్త్రాన్ని ప్రకాశవంతం చేసింది.
రామానుజన్ జీవితం నుంచి నేటి విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన పాఠాలను తీసుకోవాలి. గణితంపై గాఢమైన ఆసక్తి , అభిరుచిని చిన్న నాటినుంచే పెంపొందించుకోవాలి. స్వీయ అధ్యయనాన్ని అలవరుచుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఎదురైనా కష్టాలను అధిగమించడంలో నిబద్ధతను ప్రదర్శించాలి.సృజనాత్మకత, నూతన ఆలోచన పట్ల ఎలా ఓపికతో ఉండటం, తమ మీద తమకు నమ్మకం కలిగి ఉండటం అనేది అలవరుచుకోవాలి. ఇంతటి ప్రాముఖ్యత కలిగినందువలన గణితం ఆవశ్యకతను నేటి తరం నుండి ముందు తరాల వారికి వ్యాప్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రామానుజన్ హార్డీ వంటి గొప్ప గణితశాస్త్రజ్ణుని సలహాలు, సహకారం పొందడం ద్వారా గణితంలో గొప్పస్థాయికి ఎదిగారు. అలాగే నేటి విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలి.విద్యార్థులలో గణితశాస్త్రం పట్ల ఆసక్తిని, శ్రద్ధను పెంపొందించాలి, గణితానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించాలి. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ప్రేరణ కల్పించాలి. గణిత శాస్త్రం ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే రామానుజన్ జీవిత చరిత్ర, ఆయన చేసిన అపూర్వ గణిత కృషిని గుర్తుచేసుకోవడం ఈగణితశాస్త్ర దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
మహేశ్వరం భాగ్యలక్ష్మి
9440580925