ఒక్క పుస్తకం తోడుంటే.. అనంత జ్ఞానం మనతో ఉన్నట్టే. అలసిపోయిన బాటసారికి చల్లని చెట్టు నీడ దొరికితే.. ఆ చెట్టుకు తియ్యటి పండ్లు ఉంటే..! అలా ఉంటుంది పుస్తకాలతో నేస్తం.. అక్షరాలతో సహవాసం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా… పుస్తకాలు డిజిటల్ రూపంలోకి మారినా… పుస్తకాన్ని స్పర్శించే అనుభూతి… పఠనంతో వచ్చే జ్ఞానం శాశ్వతం. పుస్తకం మనకు విజ్ఞానం, వినోదం అందిస్తూ కొత్త ఆలోచనల ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఊహాశక్తిని పెంచి మరింత జ్ఞానవంతం చేస్తుంది. పుస్తకం నిజమైన నేస్తం.
పుస్తకం ఒక నిధి. భాషకూ, భావానికీ, వ్యక్తీకరణకూ ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞాన పరంపరను వారసత్వంగా అందిస్తున్న మాధ్యమం. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకం పోషించిన పాత్ర చాలా గొప్పది, విశిష్టమైనది కూడా. ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాలను, ఉద్యమాలను, ఉద్వేగాలను, విలువలను ఒక్కటేమిటి మనిషి సమస్త మార్పులనూ పుస్తకం తనలో నిబిడీకృతం చేసుకొని సాక్షీభూతంగా నిలబడింది. అలాంటి పుస్తకాలు అనేకమందికి విస్తృతంగా చేరడం అత్యంత అవసరం. అందుకే అక్షరాల కుప్పల్ని పోసి, తలా ఇంత జ్ఞానాన్ని పంచుకుందాం రండి అని అందరినీ ఆహ్వానిస్తుంది’ హైదరాబాద్ బుక్ ఫెయిర్’. ఈ ఏడాది చివరి మజిలీలో భాగ్యనగరంలో అక్షరాల విందు భోజనాల్ని ఆరగించి బుద్ది బలశాలులమవుదాం.
విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిగా కుదించాలన్నా.. పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృష్టించాలన్నా అక్షరానికే సాధ్యం. ‘పుస్తకంలో మునిగిన మనిషి పుట్టలో మునిగిన ముని’ అని ఆరుద్ర చమత్కారం. మనసును సానబెట్టుకొనే చందనపు చెక్క గ్రంథం. పుస్తకాలు కొత్త ఆలోచనలను నింపుతాయి. అనుభూతులతో, ఆనందాలతో జీవితమంతా పరుచుకుంటాయి. అక్షరమంటేనే క్షయం లేనిది. ఒక మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరి తనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. ఒక కొత్త బలం సమకూరుస్తుంది. మనకెదురయ్యే సవాళ్లకు సమాధానాలనూ అందిస్తుంది. ఓదారుస్తుంది. అనేక జీవితాల అనుభవాల సారాన్ని తెచ్చి చేతుల్లో పెడుతుంది. మనల్ని పురికొల్పుతుంది. చైతన్యపరుస్తుంది. ప్రేరణనిస్తుంది. ప్రేమనూ పంచుతుంది. అందుకే పుస్తకం మన మస్తకాలకు పదునుపెట్టే ఆయుధం. అయితే అన్ని పుస్తకాలూ చదవాల్సినయే అయినా మంచి పుస్తకాలను ఎంచుకోవటం ముఖ్యమైన విషయం. మూఢత్వంలోకి దింపే పుస్తకాలూ వుంటాయి. విశ్వాసాల పేర మనుషుల్నీ విభజననూ, విభేదాన్ని పెంచే రచనలు కూడా ఉంటాయి. జాగ్రత్త వహించాల్సిందే. ఏ పుస్తకాలు నిజమైన జ్ఞానాన్ని అందిస్తాయో, మనసును వికసింపజేస్తాయో ఏరుకోవాల్సిందే మరి. అందుకోసం కసరత్తుచేయాలి. పుస్తకాలు మనం చదవాల్సిందే. అయితే మన సమాజ వాస్తవికత, పరిస్థితుల సమగ్రత ఏ పుస్తకాల్లో దొరుకుతాయో వెతుక్కోవాలి. కేవలం పుస్తకపూజ పనికిరాదు. ఆచరణశీలమైన అధ్యయనం అలవర్చుకోవాలి.
ఈ సూపర్ టెక్నాలజీ పరుగులో, ఒత్తిడిలో పడి మనుషులు కొల్పోతున్నదేమిటో ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు యువకులు. ఇప్పుడు నవతరంలో రచనలు చేస్తున్న వాళ్లు పెరుగుతున్నారు. మానవసంబంధాలలో వచ్చిన మార్పులను, ఎదురౌతున్న సవాళ్లనూ సృజనాత్మకంగా చెబుతున్నారు. వారి ఆలోచనలెలా ఉన్నాయో వినాలి. అందుకు ఇదో సందర్భం. పిల్లలకు, పెద్దలకు, విద్యార్థులకు, ఉపయోగపడే వేలవేల పుస్తకాలు ఒక్క ప్రాంగణంలోకి వస్తున్న సమూహపు సమయాన సందర్శనే ఒక ఉత్సవం. పుస్తకాలే కాదు మనుషులు కలుస్తారు. సాహిత్య చర్చలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, భావాల కలబోతలు, కవులు, రచయితలు, సృజనకారులు, మరి ముఖ్యంగా పుస్తకప్రియులు కలుస్తారు. అందుకే అది పుస్తకాల పండుగ. పరిమళాలు వెదజల్లును నిండుగా. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..కానీ, ఒక కొత్త పుస్తకం కొనుక్కో’మన్న సంస్కర్తల పిలుపు జ్ఞానసమాజ నిర్మాణం కోసం ఇచ్చిందే. అందుకే పుస్తకాల పండుగలు వర్ధిల్లాలి!. పుస్తకం ఆనందాన్నిస్తుంది, అలవాట్లను మారుస్తుంది. మంచి స్నేహితుడిలా జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. తరాల మధ్య వారధి వేస్తుంది. వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతుంది. అందుకే పుస్తక పఠనాన్ని మన దినచర్యలో భాగం చేసుకోమంటూ జ్ఞాన సమాజ నిర్మాణానికి నేను సైతం అంటూ కదులుదాం. అక్షరాలన్నీ కూడబలుక్కొని, ఒక్కచోట చేరి పండుగ చేసుకుంటుంటే.. ఆ సందడే వేరు… ఆ కిక్కే వేరు. రుతువులన్నీ ఒక్కచోట చేరినట్లు… పుస్తకాలన్నీ ఒక్కచోట చేరితే… అదే పుస్తకాల రుతువు.