వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ‘క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘దర్శకుడు మోహన్ కథ చెప్పినపుడు చాలా డిఫరెంట్ కథ అనిపించింది. ప్రేక్షకులకు వందశాతం ఈ సినిమా మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది. ఇందులో నా పాత్ర పేరు భ్రమరాంబ. కథలో నా రోల్ చాలా బావుంటుంది. ఇప్పటివరకూ చేయని రోల్. అలాగే ఇది ఎక్స్ట్రార్డినరీ స్టొరీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వైజాగ్ పర్యటన ముగించుకొని, అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఓ కేసు జరిగింది. ఆ కేసు తీగలాగితే డొంక కదిలినట్లుగా చాలా మలుపులతో కథనం ఎంగేజింగ్‌గా ఉంటుంది. థ్రిల్, సస్పెన్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఇందులో ఒక క్యుట్ లవ్ స్టొరీ కూడా ఉంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాను’.